Basara IIIT: విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం ఆర్జీయూకేటీ బాసరలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి నుంచి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన తన స్వీయ అనుభవాన్ని తెలిపారు. ఆర్జీయూకేటీ బాసర ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.
సేవా కార్యక్రమాలు అనగానే ఆర్జీయూకేటీ విద్యార్థులు గుర్తుకొస్తారని, విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఐఐఐటీ ప్రత్యేక విశ్వవిద్యాలయమని, దానికి విద్యార్థులే అంబాసిడర్లుగా వెలుగొందాలని పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కోర్సులకు స్వీకారం చుట్టిందని తెలిపారు. విద్యార్థులు కష్టపడితే చదివి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని కోరారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు సేవా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్, వీసీలు భోజనం చేశారు. అనంతరం సమావేశ మందిరంలో ఆర్జీయూకేటీ బాసర విద్యార్థులతో కూడిన కమిటీల పురోగతిపై వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగీలతో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్షించారు. ఇటీవల ప్రాంగణంలో జరిగిన వివిధ అభివృద్ధి పనుల గురించి విద్యార్థులు వివరించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఇంజనీరింగ్ డే నిర్వహణ, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు అభివృద్ది చేసిన ‘హెల్త్ ప్రొఫైల్’ యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ యాప్‌ను అభివృద్ధి పరిచి జిల్లాలో ఉన్న పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అనుసంధానించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాకేశ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ రాములు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.