Group-2: నిర్మల్, డిసెంబర్ 12 (మన బలగం): గ్రూప్ -2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఆమె గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 8080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 10:00 నుంచి 12:30, వరకు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు, అలాగే 16వ తేదీన ఉదయం10:00 గంటల నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులతో రాకూడదని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్రాలలో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, టాయిలెట్స్, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలపై శిక్షకులు రవికుమార్ పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో పరీక్షల కోఆర్డినేటర్ పీజీ రెడ్డి, డిపార్ట్‌మెంట్ అధికారులు, గోవింద్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, అంబాజీ, రమణ, కిరణ్ కుమార్, శ్రీనివాస్, సుదర్శన్, సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
