CPI Karimnagar: కరీంనగర్, డిసెంబర్ 27 (మన బలగం): భారతదేశాన్ని దివాలా స్థాయి నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, జీడీపీని పరిగెత్తించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి తీరనిలోటని, దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని వారి మరణం పట్ల సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దూర దృష్టి కలిగిన రాజ నీతిజ్ఞుడని, ఆయన విధానాల వల్ల దేశంలో పేదరికం చాలా మటుకు తగ్గిందని పేర్కొన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, వందరోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావుకు అగ్నిపరీక్షలో సైతం మన్మోహన్ సింగ్ వెన్ను దన్నుగా నిలిచి తన నిజాయితీ నిరూపించుకున్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఎవరేమన్నా, ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికాడని తెలిపారు.
కొన్నాళ్లు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారని, వారి కుటుంబానికి సీపీఐ సంతాపాన్ని వ్యక్తం చేస్తుందని తెలిపారు. దేశ అభివృద్ధికి ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను చరిత్ర సదా గుర్తుపెట్టుకుంటుందని, అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన దూరదృష్టి గల నాయకుడు మన మోహన్ సింగ్ అన్నారు. దేశంలో విద్య హక్కు చట్టం తీసుకువచ్చి 14 ఏళ్ల లోపు బాలలందరూ నిర్బంధ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లారని, దేశంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిన వ్యక్తి అని ఇవే కాకుండా జాతీయ ఆహార భద్రత చట్టం ఆధార్ కార్డును ప్రజలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని తీసుకువచ్చి రైతులకు అండగా నిలబడ్డటువంటి మన్మోహన్ సింగ్ లాంటి ఒక మంచి వ్యక్తిని దేశం కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయమని వారు తెలిపారు. వారి మృతి వారి కుటుంబానికే కాకుండా భారత దేశ ప్రజలందరికీ దుర్వార్త అని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు అన్నారు.