కరీంనగర్‌లో ఘనంగా అనభేరి 77వ వర్ధంతి
Chada Venkata Reddy: కరీంనగర్, మార్చి 14 (మన బలగం): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, అణగారిన వర్గాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట అమరవీరుల ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శ్రేణులు మరింత పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి అనభేరి ప్రభాకర్ రావు 77వ వర్ధంతి సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర టెంపుల్ ముందు గల అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంలోని నిజాం నవాబుల పరిపాలన సమయంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ, వెట్టి చాకిరి చేయించుకుంటూ, ప్రజలను బానిసలుగా చూసే రోజుల్లో తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్ రావు తన చిన్నతనం నుండే ఎదిరించే స్వభావాన్ని కలిగి ఉన్నాడని, ఆనాటి పరిస్థితులను అంచనా వేసి పేదల కోసం నిజాం పరిపాలకులను, వారి తాబేదారులైన రజాకార్లను, దేశ్‌ముఖ్‌లను ఎదిరించడానికి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజలను చైతన్యపరచాడని, దున్నేవానికి భూమి కావాలని, వెట్టిచాకిరి విముక్తి కావాలని 1947 సెప్టెంబర్ 11న ఆనాటి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుమ్ మోహియుద్దీన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడంతో
ఆ పిలుపుని అందుకొని అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిలతో పాటు మరొక పదిమంది దళం నిజాం నవాబులపై, రజాకారులపై వీరొచితంగా పోరాటం నిర్వహించారని, 1948 మార్చి 14న మాందాపూర్ గుట్టల్లో భోజనం చేస్తున్న వారిపై రజాకార్ల పోలీసు మూకల కాల్పుల్లో అనభేరి ప్రభాకర్ రావు, భూపతి రెడ్డితో పాటు మరో పది మంది వీరమరణం చెందారని, ప్రజల కోసం పనిచేసే అమరత్వం పొందిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడం కోసం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించాలని, అమరవీరులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతోన్మాద బీజేపీ వక్రీకరిస్తుందని, వారి మాటలను తిప్పికొట్టేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఆనాడు సాయిధ పోరాటమే సీపీఐ నిర్వహించకపోతే నేటి తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని, నిజాం నవాబుల కింద బానిసలుగా ఉండేదని, రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్ పట్వారి, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలమని వెంకటస్వామి అన్నారు. అనభేరి ప్రభాకర్ రావుతో పాటు సింగిరెడ్డి భూపతిరెడ్డి లాంటి అమరవీరుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, రానున్న భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా పాలక ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్స్ కొయ్యడ సృజన్ కుమార్, అందె స్వామి, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మీ, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికారెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, పిట్టల సమ్మయ్య, నాలువాల సదానందం, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు వీరితో పాటు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.
