Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar: రాహుల్.. ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా?

  • ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోంది?
  • కేసీఆర్‌ను మించిపోయిన కాంగ్రెస్
  • మాజీ సర్పంచుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన సిగ్గు చేటు
  • చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది
  • 15 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చని చెబుతారా?
  • షాబాద్‌లో ఆంజనేయస్వామి ఆలయంపై దాడి అమానుషం
  • హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం నోరు మెదపరా?
  • తక్షణమే దుండుగలను అరెస్ట్ చేయాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
  • రుద్రంగిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Bandi Sanjay Kumar: మన బలగం, కరీంనగర్ బ్యూరో: ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలపై, రాష్ట్రానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. దేశమంతా పాదయాత్ర చేశానని చెప్పుకున్న రాహుల్ గాంధీకి ధైర్యముంటే ఆరు గ్యారంటీలపై తెలంగాణలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలతో కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలోనూ దొంగ హామీలు, అబద్ధాలతో ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. తెలంగాణలో రుణమాఫీ చేసినట్లుగా, ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లుగా, ఎంతో అభివృద్ధి చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ మహారాష్ట్రలో అన్ని పేపర్లకు యాడ్స్ ఇవ్వడం సిగ్గు చేటన్నారు.

గతంలో కేసీఆర్ ఇట్లనే తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర, పంజాబ్‌లకు పంచారని, కాంగ్రెస్ నేతలు ఆయనను మించిపోయారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో సర్పంచులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను ఏ మాత్రం పట్టించుకోలేదని, అప్పుడు బిల్లులు ఇవ్వకుండా వేధించి, ఇప్పుడు మద్దతు తెలపడం, చంపినోడే సంతాపసభ పెట్టినట్లు ఉందని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రానికి మంగళవారం విచ్చేసిన బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావులతో కలిసి రూ.22 లక్షల విలువైన ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు పనులను ప్రారంభించారు. స్థానిక లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు? వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీ ఆ విషయంపై మాట్లాడే దమ్ముందా? ఆరు గ్యారంటీలపై పాదయాత్ర చేసే దమ్ముందా? ప్రజలకిచ్చిన హామీలపై సమాధానం చెప్పిన తరువాతే రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి.

రాష్ర్టం మరింత అప్పుల పాలు

నా పాదయాత్రలో మూసీ వద్దకు వెళ్లిన. విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూసిన. ఆ విషపు నీటి కోరల్లో చిక్కుకుని యాదాద్రి జిల్లా ప్రజలు ఏ విధంగా విలవిల్లాడుతున్నారో గమనించిన. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగు నీటి కోసం నీళ్లు కొనుక్కొని, వాటర్ ప్లాంట్ ద్వారా తెచ్చుకునేందుకు ఏ విధంగా బాధలు పడుతున్నరో చూసిన. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుంచి కోరుతోంది. కానీ ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దన్నదే మా డిమాండ్. అట్లాగే మూసీని అడ్డుపెట్టుకుని లక్షన్నర కోట్ల దోపిడీని ఆపాలన్నదే మా తపన. 15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడానికి మేం పూర్తిగా వ్యతిరేకం. తెలంగాణ నిండా అప్పుల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని మీ మంత్రులే మొత్తుకుంటున్నరు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. జీతాలకే ఇబ్బందిగా ఉందని చెబుతున్నరు. అట్లాంటప్పుడు మళ్లీ లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్? కాంగ్రెస్ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంటే… మీరు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా?

ఏం సాధించారన మహారాష్ట్రలో పత్రికలకు యాడ్స్

తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నమని, రుణమాఫీ చేసినమని ఊదరగొడుతూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చింది. కేసీఆర్ కూడా ఇట్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిండు. పంజాబ్ రైతులకు పప్పు బెల్లాల మాదిరిగా పంచిండు. తెలంగాణ రైతులను అరిగోస పెట్టిండు. మీరు అంతకు మించి దోచుకుంటున్నరు. ఒకవైపు ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతూ ఇంకోవైపు మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ పైసలను వాడుకుంటరా? సిగ్గుండాలే…
ఎంత దుర్మార్గమంటే… ఆరు గ్యారంటీల అమలు కాలేదు. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటించిండు. కానీ, మహారాష్ట్రలో మాత్రం రుణమాఫీ చేసినం…ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నమని గొప్పలు చెబుతూ యాడ్స్ ఇస్తారా? మహారాష్ట్ర చెవిలో పూలు పెడదామనుకుంటున్నారా? దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లుగానే ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవ్వడం సిగ్గు చేటు. కాంగ్రెస్ మోసాలను తెలంగాణ సమాజం గ్రహించాలని కోరుతున్నా.

దాడులపై ముఖ్యమంత్రి నోరు మెదపరా?

శంషాబాద్‌లో ఆంజనేయ స్వామి ఆలయంపై దాడి అమానుషం. హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా సీఎం నోరు మెదపరా? హిందువులు రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి. హిందూ ఆలయాలపై దాడులు చేసిన దుండుగలను తక్షణమే అరెస్ట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *