Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): గర్భస్థ మహిళల మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భం దాల్చిన వెంటనే మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణులను గుర్తించాలన్నారు. అవసరమైన మందులను అందించాలని తెలిపారు. హై రిస్క్ గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన గర్భస్థ మహిళల మరణాల గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ గర్భిణులను ఫోన్ల ద్వారా సంప్రదించి వారి ఆరోగ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటికి తగిన సూచనలు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి సరిపడిన వైద్య సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. వైద్యాధికారుల సమన్వయ సహకారంతో జిల్లాలో గర్భస్థ మరణాలను నియంత్రించాలన్నారు. ప్రతి గర్భిణులకు ఆరోగ్యం, పోషక ఆహార ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. రక్తహీనత నివారణ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణుల్లో హృద్రోగాల నిర్ధారణకై సంబంధిత 2డీ ఎకో పరీక్ష నిర్వహించేందుకు అవసరమగు సామగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, సౌమ్య, సరోజ, నయన రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.