Former ZP Chairperson Dava Vasantha: జగిత్యాల, డిసెంబర్ 2 (మన బలగం): కేసీఆర్ పాలనలో విరాజిల్లిన గురుకులాలు నేటి కాంగ్రెస్ సర్కార్‌లో నిర్వీర్యం అవుతున్నాయని, అందులో చదువుకొనే విద్యార్థులను పట్టించుకోలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరిందని తాజా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ ఆరోపించారు. బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించి అక్కడున్న విద్యార్థులు, సిబ్బందితో దావ వసంత మాట్లాడారు. అనంతరం విద్యార్థుల సౌకర్యాలు, సమస్యలు అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి కలెక్టరెట్‌లోని ప్రజావాణికి నడుచుకుంటూ వెళ్లి పాఠశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ డీఈఓతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు అత్యంత దయనీయం పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అరకొర నిధులు వెచ్చిస్తోందని, కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యావంతులై తెలంగాణ ఖ్యాతిని లోకానికి చాటి చెప్పాలనె దృఢ సంకల్పంతో కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. కాస్మోటిక్ చార్జీలు పెంచారంటూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో సంబురాలు చేసుకుంటున్నారని, కానీ ఇక్కడ విద్యార్థులకు కనీసం సబ్బులు కూడా ఇవ్వటం లేదని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కార్యక్రమంలో వోల్లం మల్లేశం, చింత గంగాధర్ వెంకటేశ్వర్లు గంగారెడ్డి, చిట్ల రమణ, ప్రణయ్, భగవాన్, మనోజ్ నాయకులు తదితరులు ఉన్నారు.