- వేలాదిగా అక్షరాభ్యాసాలు
- భక్తజన సందోహంగా బాసర
Basra: నిర్మల్, ఫిబ్రవరి 3 (మన బలగం): బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంతపంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ జానకి షర్మిళ, అదనపు ఎస్పీ అవినాశ్ కుమార్, వసంత పంచమి వేడుకల ప్రత్యేకాధికారి, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ ఇన్‌చార్జి ఈవో సుధాకర్, ఇతర అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. వసంతపంచమిని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాధిగా భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు బారులు తీరారు. అమ్మవారి దర్శనం కోసం 6 గంటలకుపైగా క్యూలో వేచి ఉండాల్సివచ్చింది. రాష్ర్ట నలుమూలతోపాటు పలు రాష్ర్టాల నుంచి భక్తులు అధక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు అలవడడంతోపాటు ఉన్నతస్థాయికి ఎదుగుతారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర పుణ్యక్షేత్రంలో ఎటు చూసినా భక్తజన సందోహంగా మారింది.