- బాబోయ్ బిట్ కాయిన్ -4
- సెలవులపై ఉపాధ్యాయులు
- సర్వాంతర్యామి బిట్ కాయిన్
- నోరు విప్పని అధికారులు
- బాధితులు బయటకు రావాలి
Bitcoin: నిర్మల్, సెప్టెంబర్ 29 (మన బలగం): ఇందుగలడందు లేడు.. ఎందెందు వెతికి చూసినా అందందుగలడు.. బిట్ కాయిన్ బాధితుడు.. అన్నట్లు తయారైంది. అన్ని శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు బిట్ కాయిన్ వ్యవహారంలో పాలుపంచుకున్న వారే. ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండగా పోలీసు, అటవీ, రెవెన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సర్వాంతర్యామి
నిర్మల్ జిల్లాలో బిట్ కాయిన్ వ్యవహారం అన్ని శాఖల్లో కాలు మోపింది. విద్యాశాఖ ముందు వరుసలో ఉండగా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు బిట్ కాయిన్‌తో అంటకాగిన వారే. బిట్ కాయిన్ గొలుసుకట్టు వ్యవహారంలో పెట్టుబడులు పెట్టని వారిని వింతగా చూసిన పరిస్థితి ఉండేది. కానీ నేడు పెట్టిన వారిని పెట్టనివారు విచిత్రంగా చూసే పరిస్థితి తలెత్తింది. అక్రమ ధనార్జన ఎంతో కాలం నిలవదు అన్న దానికి నిదర్శనం బిట్ కాయిన్ గొలుసుకట్టు వ్యవహారం. కాగా పోలీసులు సైతం కేవలం విద్యాశాఖ పైనే దృష్టి సారించారు. కానీ అన్ని శాఖల్లో బిట్ కాయిన్ తిమింగలాలు ఉన్నాయని, ఆ దిశగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అదృశ్యమైన ఉపాధ్యాయులు
నిర్మల్ జిల్లా పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదృశ్యమయ్యారు. బిట్ కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సెలవులు పెట్టుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్లి పోయారు. జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బిట్‌కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇంకా సుమారు వందమందికి పైగానే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు సైతం బిట్ కాయిన్ వ్యవహారంలో స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు. కొన్ని నెలలుగా జిల్లాలో బిట్ కాయిన్ వ్యవహారం జోరుగా సాగింది. ఏ సారు నోట విన్నా అదే మాట వినిపించింది. పాఠశాలలకు రాకుండా కొందరు ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకోగా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాఠశాలలకు రావడం లేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.
గాడి తప్పిన విద్యావ్యవస్థ
నిర్మల్ జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అసలే ఉపాధ్యాయుల కొరతతో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థ బిట్ కాయిన్ దెబ్బకు మరింత చతికిల పడిపోయింది. గొలుసుకట్టు వ్యవహారంతో సంబంధం కలిగి ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదే వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతా ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది.
నోరు విప్పని అధికారులు
బిట్‌కాయిన్ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్న జిల్లా ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. అధికారులకు తెలిసే ఈ వ్యవహారంలో ఉపాద్యాయులు పాలుపంచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా జిల్లా విద్యాశాఖ అధికారి అందుబాటులో లేరు. ఫోను ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించడం లేదు. దీంతో ఈ వ్యవహారం అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానం తలెత్తుతోంది.
బాధితులు బయటకు రావాలి
బాధితులు బయటకు వస్తే తప్ప ఈ బిట్ కాయిన్ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టించడంలో ముందున్న వారి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని మీ డబ్బులు మీకు వచ్చే విధంగా చూస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటించినప్పటికీ బాధితులు బయటికి రావడానికి జంకుతున్నారు. పెట్టబడులు పెట్టించిన వారు కొందరు మీ డబ్బులను తిరిగి తామే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. మాయ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు మరోసారి నక్కజిత్తుల మాటలు నమ్మి బలి కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని జిల్లా పోలీసులు హామీ ఇస్తున్నారు.