Whip, MLA Adluri Laxman Kumar: ధర్మపురి, డిసెంబర్ 2 (మన బలగం): ధర్మపురి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన పెద్దపెల్లి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు ‘యువ వికాస్’ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన ఫాలాలు పైన ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారని చెప్పారు. రైతు రుణమాఫీ కింద సుమారు రూ.20 వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వ పాలకులు రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.
రైతులే నేరుగా మిల్లర్లతో మాట్లాడుకొని వడ్లను అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం ప్రతి సెంటర్ వద్ద ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి వడ్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో మిల్లర్ల దోపిడీని తట్టుకోలేక రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపే దుర్భర పరిస్థితి ఉండేదన్నారు. గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ మంత్రిగా వ్యవహరించినా ధాన్యం కొనుగోలు పైన కనీసం ఒక రివ్యూ మీటింగ్ గానీ నిర్వహించలేదన్నారు. జిల్లాలోని 72 వేల మంది రైతులకు రుణమాఫీ ప్రభుత్వం చేసిందని వెల్లడించారు. ఇతర సాంకేతిక కారణాలతో సుమారు 19 వేల మందికి రుణమాఫీ జరగలేదని, వారి రుణాలు సైతం మాఫీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన నంది చౌరస్తా వద్ద సభను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నైట్ కాలేజీని తిరిగి ప్రారంభించామన్నారు.
చేగ్యం భూ నిర్వాసితులకు వారి పరిహారం రూ.18 కోట్లు అందించామని తెలిపారు. సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహించిప్పటికి కొప్పుల ఈశ్వర్ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించలేదన్నారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీయల్ స్కూల్‌ను నియోజకవర్గానికి మంజూరు చేయించి, దాని నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని సేకరించామని వివరించారు. లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డిని కలిసి విన్నవించామని తెలిపారు. నవోదయ కళాశాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలంలో 50 పడకలతో ఆస్పత్రి నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలను ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ ద్వారా, సీఆర్ఆర్ గ్రాంట్ నుంచి సుమారు 15 కోట్లకు పైగా రూపాయలను, టీఎఫ్ఐడీసీ నిధుల ద్వారా మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించామన్నారు.
కార్యకర్తలతో సమావేశం
ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. 4వ తేదీన పెద్దపెల్లిలో జరిగే ముఖ్యమంత్రి సభలో ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్దపెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేసిన మేలును, అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.