Entrance fee to permit room
Entrance fee to permit room

Entrance fee to permit room: పర్మిట్ రూముకు ఎంట్రెన్స్ ఫీజు!

  • తల ఒక్కంటికి రూ.10 దర్జాగా దోపిడీ
  • పట్టించుకోని ఆబ్కారోళ్లు
  • మండిపడుతున్న మందుబాబులు

Entrance fee to permit room: జగిత్యాల, డిసెంబర్ 2 (మన బలగం): నిమ్మలంగా నిలబడి బుక్కెడు మందు తాగిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం వైన్స్‌ల పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతులను ఇస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో పర్మిట్ రూముల్లో ఎంట్రన్స్ ఫీజ్ పెట్టి మందు బాబుల నిషా దించేస్తున్న సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో నెలకొంది. మల్యాల మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాల్లో వైన్స్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. ఆబ్కారి శాఖ నిబంధనలను అనుసరించి వైన్స్‌ల నిర్వాహకులు పర్మిట్ రూమ్‌లను నిర్వహించాలని నిబంధనలు పెట్టింది. ఈ పర్మిట్ రూముల నిర్వహణలోనే పెద్ద లోపాలుండగా వీటన్నిటిని కాదని ఏకంగా పర్మిట్ రూమ్‌లకు ఎంట్రెన్స్ ఫీజ్ రూ.10 వసూలు చేస్తూ మందు బాబుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు అంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు సగటున వంద మందికి పైగానే ఈ పర్మిట్ రూముల్లో మద్యం సేవిస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలో నెలవారీగా, ఏడాదికి లక్షల్లో పర్మిట్ రూముల్లో వసూళ్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే పర్మిట్ రూముల్లో మందు తాగే వారికి కేవలం చిప్స్ వంటి తినుబండారాలను విక్రయించాలన్న నిబంధనలు ఉన్నాయి. నిర్ణీత 4 వందల ఫీట్ల ప్రదేశంలోనే పర్మిట్ రూమ్ నిర్వహించాలని అందులోనూ బార్ల తరహాలో టేబుల్ వేసి మద్యం సరఫరా చేయరాదన్న నిబంధన ఉందని తెలిసింది. కానీ బార్ల నిర్వాహకులను నష్టం రాకుండా వైన్సుల యజమానులు పర్మిట్ రూమ్‌లను నిర్వహించాల్సి ఉంటుందనేది మరో ప్రభుత్వ నిబంధన. కాగా దీనికి భిన్నంగా పర్మిట్ రూముల్లో చికెన్, చేప, కోడిగుడ్లతోపాటు వివిధ రకాల తినుబండారాలను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నా ఆబ్కారీ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికి తోడు పర్మిట్ రూమ్‌లోకి మందు తాగేందుకు పోయే మందుబాబులు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయల వంతున చెల్లించాలని తినుబండారాల వ్యాపారి దర్జాగా వసూలు చేస్తున్నాడని మందుబాబులు అంటున్నారు.

ఇదేమిటని అడిగితే మీ ఇష్టం అంటూ బెదిరింపు సమాధానాలను ఇస్తుండగా ఇదే అంశంపై ఆబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం విధించే మద్యం విక్రయ టార్గెట్లనే లక్ష్యంగా ఆబ్కారీ శాఖ అధికారులు పనిచేస్తున్నారని, ప్రజలు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం మానేశారని పలువురు విమర్శిస్తున్నారు. లక్షలాది రూపాయలను వెచ్చించి బార్ల లైసెన్స్‌లు పొందిన వాటి నిర్వాహకులు పర్మిట్ రూమ్ పక్కనే వెలిసే తినుబండారాల నిర్వాహకుల మూలంగా బార్ల మనుగడకు ప్రమాదకరంగా మారుతోందని పలువురు అంటున్నారు. ఇప్పటికే మద్యం ధరలను అవకాశాన్ని బట్టి పెంచుతున్న ప్రభుత్వాల తీరుతో మందుబాబులు ఆక్రోషంగా ఉన్నారు. ఇప్పటికైనా మల్యాల మండలంలోని వైన్స్ పర్మిట్ రూముల్లో అక్రమంగా విధిస్తున్న ఎంట్రెన్స్ ఫీజ్‌ను నిరోధించకుంటే ఈ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని స్థానిక కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టెందుకు ఆబ్కారీ శాఖ అధికారులను రంగంలోకి దించాలని మందుబాబులు, ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *