వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
Collector Abhilasha Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 7 (మన బలగం): పంచాయతీలో వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇంటి పన్ను వసూలు, వన మహోత్సవం, తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీలో ఇంటి పన్ను వసూలును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చేతి పంపులు, బోరు బావుల పనితీరును పర్యవేక్షించి, అవసరమైన చోట మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలన్నారు. తీవ్రమైన నీటి ఒత్తిడి గల మండలాలను గుర్తించి ఆయా మండలాల్లోని గ్రామాలలో నీటి సమస్యను అధిగమించేలా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు గ్రామాల్లో వసూలు చేసిన ఇంటి పన్ను వసూలు వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వసూలు చేసిన పన్నులకు చలానాలు కట్టి, సంబంధిత ఖాతాల్లో జమచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల వ్యాపారస్తుల వాణిజ్య లైసెన్సులను వంద శాతం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవం నాటికి గ్రామాల్లోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో తనిఖీ చేసి నివేదికలను పంపాలన్నారు. గ్రామాల్లో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యాన్ని కొనసాగించాలన్నారు. మండలస్థాయి అధికారులకు గ్రామీణ స్థాయి అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది తమ విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ గోవింద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
