Food Festival: ధర్మపురి, డిసెంబర్ 21 (మన బలగం): తెలంగాణ ఆహారోత్సవంలో భాగంగా ధర్మపురిలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌ను జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన తల్లిదండ్రుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులను చదువుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు స్వయంగా వండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, మండల విద్యాధికారి సీతాలక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.