Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 10 (మన బలగం): ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట్ వార్డు నెంబర్ 6లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్‌ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల గణన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే గ్రామ పంచాయతీలతో పాటు నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ పట్టణాలలో సజావుగా సాగుతోందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నివాస గృహాలను ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించడం జరిగిందని, ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు సర్వే నిర్వహించాల్సిన తీరుపై శిక్షణా తరగతుల ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించామని అన్నారు. సమగ్ర సర్వేను ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి సంశయాలకు లోనవకుండా ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డీఆర్వో రత్న కళ్యాణి, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.