Nimal SP
Nimal SP

Nirmal SP: తప్పు చేస్తే దండించా.. మంచి చేస్తే ప్రశంసించా.. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల

Nirmal SP: ‘జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది తప్పు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నాం. మంచి పని చేసిన అధికారులను వెనువెంటే ప్రశంసించాం.’ అని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లాలో గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని సమష్టి కృషితో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. గణపతి నిమజ్జన కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన 128 మంది పోలీసులకు, అధికారులకు శుక్రవారం ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీసు వ్యవస్థ ఒక కుటుంబం లాంటిదని, పెడదారిన పయనించే వారిని హెచ్చరించడం కుటుంబ పెద్ద కర్తవ్యం అని ఎస్పీ అన్నారు. పోలీసు శాఖలో తనకు ఎవరూ శత్రువులు లేరని, అందరూ తన కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు.

సమష్టి కృషితోనే సత్ఫలితాలు

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లే సత్ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నెల రోజులుగా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఎస్పీ కొనియాడారు. వరదలు, వినాయక నిమజ్జనం కార్యక్రమాల్లో పోలీసు శాఖ కృషి అభినందనీయమని ప్రశంసించారు. దసరా నవరాత్రుల్లోనూ ఇదేవిధంగా పనిచేసి పోలీసు శాఖలో నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

అన్ని వర్గాల సహకారం అభినందనీయం : ఏఎస్పీ అవినాష్ కుమార్

వినాయక నిమజ్జనోత్సవంలో అన్ని వర్గాల వారు అందించిన సహకారం అభినందనీయమని ఏఎసపీ అవినాష్ కుమార్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిమజ్జనోత్సవం పూర్తిచేయడం ఆనందంగా ఉందన్నారు. గతంలో భైంసాలో చోటు చేసుకున్న సంఘటనలు చూసి అందరూ భయపడ్డారని, దానికి విరుద్ధంగా ఈ సారి బందోబస్తు జరగటం హర్షించదగ్గ విషయం అని తెలిపారు.

తొందరగా నిమజ్జనం పూర్తయింది: డీఎస్పీ గంగా రెడ్డి

నిర్మల్‌లో గతంతో పోల్చుకుంటే తొందరగా నిమజ్జనం పూర్తి కావటానికి ముఖ్య కారణం బ్లూ కొల్ట్ మరియు పెట్రోల్ కార్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకు మాత్రమేనని, నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బ్లూ కొల్ట్, పెట్రోల్ కార్, ఐటీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *