- కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని
- కిలోమీటర్ పొడవునా నిలిచిపోయిన వాహనాలు
Kaleshwaram Project Telangana BRSP roko protest Khanapur: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తూ కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గోదావరి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో నాలుగు మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, అన్నపూర్ణ, వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల శ్రేయస్సు కోరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్మించారని తెలిపారు. ప్రాజెక్టును అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ బురదజల్లడంపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. లక్ష ఎకరాలకు నీరందించే ఉద్దేశంతో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించారని వెల్లడించారు. ఓవైపు వరదల వల్ల రాష్ట్రం అతలాకుతలమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా కేసీఆర్‌పై బురద జల్లడం అవమానకరమని అన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు. ఓవైపు రైతులు యూరియా లేక అనేక ఇబ్బందులు పడినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన అనంతరం కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేశారు.

