ఎమ్మెల్యే, కలెక్టర్లకు జర్నలిస్టుల వినతిపత్రం
Telangana journalists housing plots Nirmal Jupally Krishna Rao Maheshwar Reddy: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చూస్తామని నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మంత్రిని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఇళ్ల స్థలాలను కేటాయించి ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయాలని జర్నలిస్టులు కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి మీ సమస్యను నెరవేర్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ నెరవేర్చుతాను : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయమై ఇచ్చిన హామీని నెరవేర్చుతానని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు తన వంతు కృషి ఎప్పుడు జర్నలిస్టులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పరిశీలించి పరిష్కరిస్తాం: జిల్లా కలెక్టర్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ పథకం కింద ఇంటిని మంజూరి చేయాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ మీ సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
