Telangana heavy rains relief Jupally Krishna Rao Nirmal floods crop damage: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): జిల్లాలో కురుస్తున్న నిరంతర భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.
ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని, లోతట్టు గ్రామాల ప్రజలను ముందుగానే సమాచారం ఇచ్చి రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని గ్రామాల వారీగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, వంతెనలు, నివాస గృహాలు దెబ్బతిన్న నేపథ్యంలో సంబంధిత శాఖలు తక్షణమే సర్వే చేసి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనల మరమ్మత్తులను నాణ్యతతో పునర్నిర్మించేలా అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే వరదల కారణంగా నీట మునిగిన వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలను తక్షణమే సర్వే చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్ తప్పనిసరిగా చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యశాఖ అధికారులు తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే చేపట్టి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు అందించాలని సూచించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టంచేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మండలాల వారీగా, శాఖల వారీగా భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండె విట్టల్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

