- భైంసా వ్యవసాయ మార్కెట్లో రైతుల నిలువు దోపిడీ
- మితిమీరిపోతున్న కమీషన్ ఏజెంట్లు ఆగడాలు
- మార్కెట్ కాంటాలు లేక మోసపోతున్న రైతులు
- నగదు ఇవ్వాలంటే వెయ్యికి రూ.30 కట్
- మామూలుగా తీసుకుంటున్న మార్కెట్ కమిటీ అధికారులు
Bhainsa market: నిర్మల్, అక్టోబర్ 20 (మన బలగం): రైతులు అరిగోసపడి పండించిన పంటను అరక్షణంలో దోచుకుంటున్నారు. పండించడానికి కష్టపడ్డ రైతుకు మిగిలే సొమ్ము కన్నా దళారులే అధికంగా సంపాదిస్తున్నారు. తరుగు, తేమ పేరిట కొలతల్లో కోతలు విధిస్తూ దోపిడీ చేస్తున్నా నియంత్రించాల్సిన మార్కెట్ కమిటీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. నిత్యం భైంసా మార్కెట్లో రైతులు నిలువు దోపిడీ గురవుతున్నారు. ముధోల్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలల్లో సోయా పంట పండడంతో అమ్మకానికి రైతులు పంటను మార్కెట్కు తెస్తే కొనుగోలుదారులు, కమీషన్ ఏజెంట్లు కలిసి రైతులను నిలువునా దోచేస్తున్నారు. పంట అమ్మిన తర్వాత నగదు డబ్బులు ఇవ్వాలంటే రూ.1000కి రూ.30 కట్ చేస్తున్నారు. ఒక రైతు 25 క్వింటాళ్ల సోయా అమ్మితే లక్ష రూపాయలు కమీషన్ ఏజెంట్ వద్ద తీసుకోవాలంటే రూ.3000 కట్ చేసి ఇస్తున్నారు. ప్రతి నిత్యం భైంసాలో కోట్ల రూపాయల్లో మార్కెట్ జరుగుతుంది.
అంటే కమీషన్ ఏజెంట్లు, దళారులు రైతులకు కోటి రూపాయల నగదు ఇస్తే మూడు లక్షల రూపాయలు దోచుకుంటున్నారన్నమాట. ఈ తతంగమంతా నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, ఇది భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో బహిరంగ రహస్యమైంది. మార్కెట్ అధికారులు ఎందుకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. రైతు కష్టపడి పంట పండిస్తే, మార్కెట్కు తెచ్చి అమ్ముదాం అనుకుంటే కమీషన్ ఏజెంట్, దళారులు నిబంధనలకు విరుద్ధంగా రైతుల రక్తం తాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఒక ఎకరంలో రైతు పంట పండిస్తే రైతుకు పెట్టుబడి ఖర్చులు పోను మిగిలేది ఎకరానికి రూ.15 వేలు మాత్రమే. కమీషన్ ఏజెంట్, దళారులు ఆ రైతు నుంచి వేలల్లో దోచుకుంటుంటే ఇక అధికారులు ఎందుకు ఉన్నట్టు? ఇదిలా ఉంటే కొనుగోలుదారుల తీరు మరీ అధ్వానం మారింది. క్వింటాలుకు రెండు కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నట్లు ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
దీనికి తోడు పంటకు తూకం వేయాలంటే మార్కెట్ అధికారులు, మార్కెట్ కాంటాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ ఏజెంట్లు తమ దుకాణాల ముందు సొంత కాంటాలను ఏర్పాటు చేసి తూకంలో మోసం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కమిటీ దడువాయిల ప్రమేయం లేకుండా తూకం వేస్తున్నారు. తక్ పట్టిలో దడువాయిల పేరిట వెళ్లిన డబ్బులు కమీషన్ ఏజెంట్లే వారి జేబుల్లో వేసుకుంటున్నా మార్కెట్ కమిటీ అధికారులు ఎందుకు కిమ్మనడంలేదో అర్థం కావడం లేదు. ఇకనైనా అధికార యంత్రాంగం, స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దేశానికి వెన్నెముక అయినా రైతాంగాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.