BJLP leader Maheshwar Reddy
BJLP leader Maheshwar Reddy

BJLP leader Maheshwar Reddy: కేబినెట్‌లో విభేదాలు.. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు

  • కట్టడి చేయడంలో సీఎం రేవంత్ విఫలం
  • ప్రభుత్వాలను కూల్చిన ఘనత ఆ పార్టీదే
  • తప్పుడు ఆరోపణలతో దివాళాకోరు రాజకీయాలు
  • బీజేపీని బ‌ద్నాం చేస్తున్న మంత్రి శ్రీధ‌ర్ బాబు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
  • బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలకవ్యాఖ్యలు

BJLP leader Maheshwar Reddy: నిర్మల్, నవంబర్ 4 (మన బలగం): కేబినెట్‌లో విభేదాలు, కాంగ్రెస్‌లో కుమ్ములాట‌లను క‌ట్టడి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చేందుకు ప్రయ‌త్నిస్తున్నాయని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయించడం ముఖ్యమంత్రి దివాళాకోరు రాజ‌కీయాలకు నిద‌ర్శనమని మండిపడ్డారు. ప‌లు రాష్ట్ర ప్రభుత్వాల‌ను కూల్చిన చ‌రిత్ర కాంగ్రెసుదేనని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కయింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత‌ల‌పై కేసులు పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ మంత్రి శ్రీధ‌ర్ బాబు అవ‌గాహ‌న లేకుండా, అవివేకంతో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవ‌స‌రం బీజేపీకి లేదన్నారు. బీఆర్ఎస్‌తో గ‌తంలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చ‌రిత్ర కాంగ్రెసుదని గర్తుచేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఏనాడూ ఎలాంటి స‌ఖ్యత లేదన్నార. బీజేపీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు.

మ‌ధ్యప్రదేశ్, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ కూటమి ప్రభుత్వాలు అంత‌ర్గత కుమ్ములాట‌ల‌తో కూలిపోయాయే త‌ప్ప అందులో బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవ‌డానికి గ‌ల కాంగ్రెసులోని అంత‌ర్గత కుమ్ములాట‌లే అన్న వాస్తవాన్ని క‌ప్పిపుచ్చుతూ బీజేపీని బ‌ద్నాం చేసేలా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడ‌డం కుట్రపూరితమన్నారు. ఇది బీజేపీని అప్రతిష్టపాలు చేయ‌డానికి ఉద్దేశ‌పూర్వకంగా మాట్లాడ‌డం మంత్రి దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శనమన్నారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాల‌ను కూల్చిన పాప‌పు చ‌రిత్ర కాంగ్రెసుదేనన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఆర్టిక‌ల్ 356ను 90 సార్లు ఉప‌యోగించి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేత‌ర‌ స‌ర్కార్లను కూల్చివేసిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన పాపం కాంగ్రెసుదేనన్నారు. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెసేత‌ర పార్టీల ప్రభుత్వాల‌ను అకార‌ణంగా, నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన ముద‌న‌ష్టపు చ‌రిత్ర కాంగ్రెసుదన్నారు. బీజేపీ ఏనాడు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదన్నారు. రాజ‌కీయ కార‌ణాల‌తో ఏ రాష్ట్రంలోనూ ఆర్టిక‌ల్ 356ను ఉప‌యోగించి గ‌వ‌ర్నర్ పాల‌న విధించ‌లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల‌ను మార్చిన చ‌రిత్ర ఆ పార్టీదేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978 నుంచి 1983 వ‌ర‌కు న‌లుగురు సీఎంలను, 1989 నుంచి 1994 వ‌ర‌కు ముగ్గురు సీఎంల‌ను 2009 నుంచి 2013 వ‌ర‌కు సీఎంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణం త‌ర్వాత రోశ‌య్యను ఏడాది గ‌డ‌వ‌క ముందే సీఎం కుర్చీ నుంచి దించేసి కిర‌ణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అని తెలిపారు. ఇలా పార్టీలోని అంత‌ర్గత కుమ్ములాట‌ల వ‌ల్ల ముఖ్యమంత్రుల‌ను మార్చడం కాంగ్రెస్ నైజమన్నారు.

ముఖ్యమంత్రుల‌ను మార్చిన ట్రాక్ రికార్డు ఉన్న కాంగ్రెసు పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని మార్చి మ‌రో సీనియ‌ర్ మంత్రిని సీఎంను చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నట్టు సమాచారముందన్నారు. ఇదే విష‌యాన్ని మీడియాతో తాను మాట్లాడడని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని ప‌డ‌దోసే వ్యూహం మంత్రి శ్రీధ‌ర్ బాబుకు క‌నిపించ‌డం ఆయ‌న‌ దృష్టి లోపమేనన్నారు. కాంగ్రెసులో ఉన్న కుమ్ములాట‌ల గురించి చెబితే, ప్రభుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ ప్రయ‌త్నిస్తోంద‌ని మంత్రి మాట్లాడ‌డం ఆయ‌న దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శనమని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కకి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళ‌న ప్రాజెక్టు వ్యయం ల‌క్షన్నర కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌టిస్తే, అలాంటిదేమీ లేద‌ని, అస‌లు డీపీఆరే ర‌డీ కాలేద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇలా ప‌లు అంశాల్లో వీరిద్దరి మ‌ధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయని వెల్లడించారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు పార్టీ కండువా క‌ప్పే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి మిన‌హా మ‌రో మంత్రి లేరని తెలిపారు. ఫిరాయింపుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డితో ఇత‌ర సీనియ‌ర్ మంత్రుల‌కు విభేదాలున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైక‌మాండ్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాక‌రిస్తున్నది వాస్తవం కాదా అని అడిగారు. ఏడు సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని క‌ల‌వ‌డానికి ప్రయ‌త్నించి అపాయింట్‌మెంట్ ల‌భించ‌క భంగ‌ప‌డిన విష‌యం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

కేబినెట్‌లో మొద‌ట్నుంచి కాంగ్రెసులో కొన‌సాగుతున్న ఆరుగురు మంత్రులు ఒక గ్రూపుగా, సీఎంతో స‌హా టీడీపీ, బీఆర్ఎస్‌ల నుంచి వ‌చ్చిన మిగిలిన ఆరుగురు మ‌రో గ్రూపు మ‌రో వ‌ర్గంగా విడిపోయారన్నారు. మంత్రిమండ‌లి ఇలా నిలువునా చీలిన విష‌యం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి మార్పు గురించి కాంగ్రెస్ సీనియ‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ గురించే తాను ప్రస్తావించానన్నారు. కాంగ్రెసులో ఉన్న కుమ్ములాట‌ల‌ను క‌ప్పిపుచ్చేందుకు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయ‌త్నం బీజేపీ చేస్తోంద‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం దుర్మార్గమన్నారు.

బీఆర్ఎస్‌తో కుమ్మక్కయింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో ఎన్నో అక్రమాలు, భారీ స్థాయిలో అవినీతి జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం తిన్నదంతా క‌క్కిస్తామ‌ని, కేసీఆర్‌తో పాటు హ‌రీశ్ రావు, కేటీఆర్ వంటి మాజీ మంత్రుల‌పై కేసులు త‌ప్పవ‌ని ప్రగ‌ల్భాలు ప‌లికిన కాంగ్రెస్, ఇపుడు 11 నెల‌లుగా బీఆర్ఎస్ నేత‌ల‌పైన ఎందుకుని చ‌ర్యలు తీసుకోవ‌డం లేదో తెర వెనుక జ‌రుగుతున్న మంత్రాంగ‌మేంటో మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్రజ‌ల‌కు వివ‌రించాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మిష‌న్ భ‌గీర‌థ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి భారీ అవినీతి, అక్రమాల‌కు సంబంధించిన కేసుల్లో ఇప్పటి వ‌ర‌కు ఒక్క బీఆర్ఎస్ నేత‌ను కూడా అరెస్టు చేయ‌క‌పోవ‌డం వెన‌క మ‌త‌ల‌బేంటని ప్రశ్నించారు. అస‌లు ఈ కేసుల‌ను కాంగ్రెస్ స‌ర్కారు సీబీఐ విచార‌ణ‌కు ఇవ్వక‌పోవ‌డం అంటే బీఆర్ఎస్ నేత‌ల‌ను కాపాడ‌డం కాదా అని నిలదీశారు. ఈ కేసులు కొలిక్కి రాకుండా నీరుగార్చేందుకు రేవంత్ రెడ్డి స‌ర్కారు ప్రయ‌త్నిస్తుండ‌డం వెన‌క ప్రధాన కార‌ణం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవ‌డం కాదా అని అడిగారు.

బీఆర్ఎస్‌తో అస‌లు కుమ్మక్కు రాజ‌కీయాలు చేస్తున్న కాంగ్రెస్ ఈ చీక‌టి ఒప్పందాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ క‌లిసి కాంగ్రెస్ స‌ర్కారును కూల్చాల‌ని చూస్తున్నాయంటూ మంత్రి శ్రీధ‌ర్ బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం చేత‌కాక‌, కాంగ్రెసులో ఉన్న కుమ్ములాట‌ల‌ను క‌ట్టడి చేసుకోవ‌డం సాధ్యం కాక‌, ఇలా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయ‌త్నాలు సాగుతున్నాయంటూ బీజేపీని బ‌ద్నాం చేయ‌డం, త‌ద్వారా ప్రజ‌ల నుంచి కాంగ్రెసు సానుభూతి పొందాల‌ని చూడ‌డం ముమ్మాటికీ కుట్రపూరిత‌మేనన్నారు.

కాంగ్రెసులో ఉన్న కుమ్ములాట‌లు, కేబినెట్‌లో ఉన్న విభేదాలతో ముఖ్యమంత్రి మార్పు జ‌రుగుతోంద‌న్న విష‌యం ప్రజ‌ల్లోకి బాగా వెళ్లడంతో ప్రభుత్వ ప్రతిష్ట దిగ‌జారుతోంద‌ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెసుకు జ‌రుగుతున్న న‌ష్టాన్ని నివారించ‌డానికి ప్రత్యర్థి బీజేపీని నిందించాలంటూ ఇచ్చిన ఆదేశాల‌తోనే మంత్రి శ్రీధ‌ర్ బాబు నిన్న పత్రికా ప్రక‌ట‌న జారీ చేసారే త‌ప్ప జ‌రుగుతున్న ప‌రిణామాలు మంత్రికి తెలియ‌క కాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి చేత‌నైతే కేబినెటులో విభేదాలు, కాంగ్రెసులో కుమ్ములాట‌లు లేకుండా చేసుకోవాలని హితవు పలికారు. అంతేగాని కాంగ్రెసు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్న లోపాలు, వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ప్రత్యర్థి బీజేపీని బ‌ద్నాం చేయండంటూ మంత్రుల‌ను ఉసిగొల్పడం సీఎం రేవంత్ రెడ్డి అస‌మ‌ర్థతకు, దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శనమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *