- కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
- సానుకూలంగా స్పందించిన గడ్కరీ
- మానేరుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సి.ఆర్.ఐ.ఎఫ్) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు, వంతెనల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ప్రధానంగా కేశవపట్నం నుంచి పాపయ్యపల్లె మీదుగా సైదాపూర్ వరకు 15 కి.మీ.ల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్‌గా విస్తరించాలని, కొడిమ్యాల నుండి గోవిందారం మీదుగా తాండ్రియాల వరకు 30 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్‌గా విస్తరించాలని కోరారు.
అట్లాగే చొప్పదండి మండలం అర్నకొండ నుంచి గోపాల్ రావు పేట మీదుగా మల్యాల చౌరస్తా వరకు 45 కి.మీల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుంచి సింగారం మీదుగా ముస్తాబాద్ మండలం రాంరెడ్డి పల్లె వరకు 15 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి పోతూరు రోడ్ (కి.మీ 18/0- 2), బావుపేట ఖాజీపూర్ ( కి.మీ2/0-2) వరకు మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం సహా మొత్తం 90 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులకుగాను రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్‌కు హామీ ఇచ్చారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపైనా గడ్కరీ ఆరా తీశారు.
