Budget 2024: 2024 బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం పన్ను విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొత్త పన్ను విధానం ఉండనున్నట్లు సమాచారం. కొత్త పన్ను విధానం కొత్త స్లాబ్లకు రూపకల్పన చేస్తన్నట్లు తెలిసింది. సంవత్సరానికి రూ.5లక్షల వరకు సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదారులు, వార్షిక ఆదాయం రూ.15 లక్షలకు మించిన వారికి పన్నుల చెల్లింపులో భారీ ఊరట లభించే అవకాశముంది. ఇప్పటి వరకు రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి పన్ను విధించేవారు. దీన్ని ఇకపై రూ.5లక్షల వరకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. అంటే రూ.5 లక్షల వరకు సంవత్సర ఆదాయం కలిగిన వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం.
పన్ను తగ్గింపుతోపాటు ఐటీ రిటర్న్స్‌ను మరింత సులభతరం చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విధి విధానాలు పూర్తిగా స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మధ్యతరగతి వారికి, ఉద్యోగార్థులకు పన్ను చెల్లింపులో ఉపశమనం లభిస్తుందని తెలుస్తోంది.
సామాన్య ప్రజలపైనా పన్నుల భారాన్ని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రీ బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా పరిశ్రమల ప్రముఖుల, సంఘాలు ఆదాయ పన్ను చెల్లింపును దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులపై పన్నుల భారం తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాపార రంగాన్ని సరళీకృతం చేసి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME) రంగాన్ని స్థిరపరిచేందుకు ఆర్థిక విధానంలో మార్పులు తేవాలని కోరారు.