electricity bill: కరెంటు బిల్లింగ్ చేసే ఆపరేటర్ మీ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడా? దీంతో మీటర్ రీడింగ్ పెరిగి స్లాబ్ రేట్ చేంజ్ అవుతోంది. దీంతో విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఆపరేటర్‌ను అడిగితే అంతే అని అంటున్నాడా? ఇక ఈ సమస్యలకు చెక్ పడనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. బిల్లింగ్ మెషిన్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించి వినియోగదారుడు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఆపరేటర్ లేటుగా వచ్చినా 30 రోజులకే బిల్లు
విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. ఇప్పటి వరకు కరెంటు బిల్లింగ్ కొట్టే ఆపరేట్ ఏ రోజు ఆ వస్తే ఆ రోజే కటాఫ్‌గా పరిగణించేవారు. అంటే ఆపరేట్ బిల్లింగ్ చేసిన రోజు 30 రోజులు మించిపోయినా వచ్చిన బిల్లు మొత్తం ఏక కాలంలో చెల్లించాల్సి వచ్చేంది. ఈ తరుణంలో బిల్లింగ్ చేయడం రెండు రోజులు ఆలస్యమైనా చాలా విద్యుత్ మీటర్లలో స్లాబ్ చేంజ్ అవుతోంది. దీంతో రెండు నుంచి నాలుగింతల బిల్లు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. గృహ వినియోగదారులకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ కాల్చినా మొత్తం బిల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 30 రోజులకే బిల్లింగ్ చేస్తే ఉచిత కరెంటుకు అర్హులమయ్యేవారమని వినియోగదారులు విద్యుత్ అధికారులతో వాదనలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ కాల్చినా జీరో బిల్లు కాస్త వేలల్లో వస్తోంది. ఉచిత విద్యుత్ పథకానికి ముందు సైతం తాము ఇంతేసి బిల్లు కట్టలేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో సమస్యలకు చెక్
ఈ సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. బిల్లింగ్‌కు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నది. ఇకపై విద్యుత్ ఆపరేట్ రావడం ఆలస్యమైనా ప్రతి నెలా 30 లేదా 31 రోజులకు మాత్రమే కరెంటు బిల్లు కట్టేలా ఆ మేరకు మీరు వినియోగించిన యూనిట్లను గణించేలా కొత్త సాఫ్టవేర్ రూపొందించారు. దీని ప్రకారం ఒక్క నెలలో అంటే 30 లేదా 31 రోజుల్లో మీరు వినియోగించిన కరెంటుకు మాత్రమే బిల్లు చెల్లిస్తారన్నమాట. ఆపరేటర్ ఎప్పుడు వచ్చిన ఇకపై మీరు చెల్లించాల్సిన బిల్లు ముందే నిర్ధారించబడి ఉంటుంది. ఆపరేటర్ల వద్ద ఉండే బిల్లింగ్ మెషిన్లో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. దీంతో ఒక్క నెల రోజుల్లో మాత్రమే మీరు వాడిన విద్యుత్‌కు సంబంధించి లెక్కించి వినియోగదారుడు ఎంత చెల్లించాలో చూపిస్తుంది. ఆ మేరకు ఆపరేటర్ బిల్ జనరేట్ చేస్తారు.
అదనపు సమాచారం తెలుసుకునేందుకు : http://tgsouthernpower.org లేదా Energy Charges Calculator for Domestic Services