- మలివిడత జాబితాలోనూ చేరని పేరు
- నేతల పనితీరుపై భక్తుల ఫైర్
Dharmapuri: జగిత్యాల, నవంబర్ 30 (మన బలగం): దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందిన ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘ప్రసాద్’ పథకంలో చోటు దక్కకపోవడంతో జగిత్యాల జిల్లాలో విమర్శలు జోరందుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టెంపుల్ టూరిజం, ఆలయాల అభివృద్ధి కోసం కొత్తగా ప్రసాద్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రముఖ, చారిత్రాత్మక ఆలయాల జాబితాను పంపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని రామప్ప, జోగులాంబ, భద్రాచలం ఆలయాలతోపాటు వేములవాడ దేవస్థానం పేర్లను మొదట పంపించగా ఇందులో వేములవాడ మినహా మిగతా మూడు ఆలయాలను కేంద్రం మొదట ఎంపికచేసి చివరన వేములవాడ ఎంపిక చేస్తూ ప్రకటన జారిచేసింది. మొదటి విడతలో ఎంపికైన భద్రాచలం అభివృద్ధికి రూ.61 కోట్ల ప్రతిపాదనలు పంపగా కేంద్రం రూ.41.38 కోట్లు విడుదల చేసింది. అదేకోవలో జోగులాంబ ఆలయానికి రూ.80 కోట్ల ప్రతిపాదనలకు రూ.36.73 కోట్లు, రామప్ప ఆలయానికి రూ.62 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వేములవాడ ఆలయ ప్రతిపాదన ఆలస్యం కావడంతో నిధుల విడుదల ఆలస్యమైంది. నేరుగా కలెక్టర్ల ఖాతాల్లో చేరే ఈ నిధులతో కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనట్లు తెలిసింది.
మలివిడత జాబితాలోనూ చేరని ధర్మపురి
మొదటి విడతలో కేంద్రం పిలుపుతో రాష్ట్ర దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రామప్ప, జోగులాంబ, భద్రాచలం, వేములవాడ పేర్లను కేంద్రానికి పంపారు. అదే మాదిరిగా రెండో విడత జాబితాను సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో పాలమూరులోని కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం, బాసర, అచ్చంపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం, మమబూబ్‌నగర్‌లోని లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం, ఉర్కొండ అభయాంజనేయ స్వామి ఆలయం, వికారాబాద్ అనంతగిరి క్షేత్రం, చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర ఆలయం, కీసర గుట్ట శివాలయం, కురవి వీరభద్ర స్వామి దేవాలయం, ఏడుపాయల వన దుర్గామాత ఆలయం, బిచ్కుంద బసవలింగప్ప గుడిల పేర్లను కేంద్రానికి పంపేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
‘ప్రసాద్’ స్కీమ్‌లో ఎంపికైన ఆలయాలకు కోట్ల నిధులు
ప్రసాద్ పథకంలో కేంద్రం ఎంపిక చేసే ఆలయాలకు కోట్లాది రూపాయలను విడుదల చేస్తుంది. ఈ నిధులు నేరుగా కలెక్టర్ అకౌంట్‌లోకి చేరుతాయని, వీటి ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధికల్పన, ఆర్థికాభివృద్ధి, సంస్కృతి, హస్తకళలు, వంటకాలు వంటి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు పుణ్యక్షేత్రాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక నేతలకు కరువైన చిత్తశుద్ధి
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నేరుగా ఇచ్చే వంద శాతం నిధులతో ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న చిత్త శుద్ధి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తోపాటు స్థానిక ఎంపీ వివేక్‌కు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సిఫార్సు చేసి తొలి విడత జాబితాలో చేర్చలేకపోయినా రెండో విడత జాబితాలో చేర్చేలా కృషి సాగలేదని ధర్మపురి లక్ష్మీ నరసింహుని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ధర్మపురి పట్టణ అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ కనిపించడం లేదని అంటున్నారు. అవ్వ పెట్టదు తిననియ్యదు అన్నట్లు కాంగ్రెస్ నాయకుల తీరు కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రసాద్ పథకంలో ధర్మపురి ఆలయాన్ని చేర్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహుడిని నిత్యం కొలిచే ఎందరో జిల్లాలోని బీజేపీ నేతలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రసాద్ నిధులు తెప్పించేందుకు కృషిచేయాలని స్థానికులు కోరుతున్నారు.