Journalists for Houses: సమాజ చైతన్యం కోసం తమ జీవితాలను తృణ ప్రాయంగా ధారపోస్తున్న అర్హత గల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ మీడియా రంగంలో పనిచేస్తున్న 90 శాతం మంది జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా ఉచిత ఇండ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఎస్టీయూ నాయకులు శ్రీనివాసరెడ్డిని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వత రెడ్డి, సదానందం గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సీర్ణంచ రవీందర్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి భైరం హరికిరణ్, నమస్తే ఉపాధ్యాయ పత్రిక కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ పాలెపు శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.