- వ్యక్తిగత పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం
- టీ హబ్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలు
- పరిసరాల పరిశుభ్రత పాటించండి
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం
- నిర్మల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్
Fever survey: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం అందుబాటులో ఉందని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత వైద్యాన్ని పొందాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.రాజేందర్ అన్నారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో అనేక అంటు వ్యాధులను నిర్మూలించవచ్చని అన్నారు. కాచి, చల్లార్చి, వడపోసిన నీటిని తాగడం, వేడి ఆహార పదార్థాలను తినడం ద్వారా అంటు వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఇంటి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. మురికి నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విష జ్వరాలు సోకిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని టీహబ్‌లో అన్ని రకాల రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఫీవర్ సర్వేలు చేస్తున్నామని, ఎలాంటి వ్యాధులు సోకినా తమ సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.