Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నవంబర్ 8, 9 తేదీలు (శని, ఆదివారాలు) అన్ని పోలింగ్ బూత్‌లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటరుగా నమోదు, పేరు, చిరునామా, తదితర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే తమ అభ్యంతరాలను అధికారులకు ఆధారాలతో తెలుపవచ్చునన్నారు. జనవరి 01, 2025 నాటికి 18 ఏండ్లు నిండబోవు యువతి యువకులు ఫారం నెంబర్ 6తో ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చనన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయుటకు ఫారం-6, ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఫారం-7, జాబితాలో మీ చిరునామా, సవరణలు చేయుటకు ఫారం-8 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతకుముందు పాఠశాలను పరిశీలించి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు అందించాలని, మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో రత్న కళ్యాణి, బూత్ స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.