నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Collector Abhilash Abhinav: ఇథనాల్ పరిశ్రమ వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల రైతులు, విద్యావంతులు, ప్రజలు, పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇథనాల్ పరిశ్రమ వలన ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమపై రైతులు, గ్రామస్తుల సందేహాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇటీవల ఆందోళన చేసిన వారి వాహనాలు జప్తు చేయడంతో పాటు, పలువురిపై కేసులు నమోదు చేశారని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. పోలీస్ శాఖ అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు.
పరిశ్రమపై మహిళలు, రైతులు, విద్యావంతులు, యువత సందేహాలను, ప్రశ్నలను లిఖిత తహసీల్దార్ స్వాతికి అందించాలని సూచించారు. సందేహాలను శాస్త్రీయంగా పరిశీలించి, తదుపరి సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డివిజనల్ అటవీ శాఖ అధికారి షేక్ ఆదాం నాగిని భాను, డీఆర్వో భుజంగ్ రావ్, డీపీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డీఎంహెచ్ఓ రాజేందర్, దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామస్తులు, రైతులు, విద్యావంతులు, యువత, కాలుష్య నియంత్రణ అధికారులు, ఇథనాల్ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.