Theft of cash from a car: నిర్మల్, నవంబర్ 20 (మన బలగం): నిర్మల్ జిల్లా భైంసాలో ఆగి ఉన్న కారు కిటికీ అద్దాలు పగులగొట్టి రూ.1.80 లక్షల నగదును దొంగలించిన ఉదంతం బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా బస్టాండ్ పక్కన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం గడ్‌చందా గ్రామానికి చెందిన అల్లం భోజన్న బీడీ కంపెనీ టేకేదారుగా పనిచేస్తున్నారు. బీడీ కార్మికుల వేతనాలను చెల్లించే నిమిత్తం భైంసాలోనే ఉన్న మరో ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.90 వేలు డ్రా చేశాడు. ఆయన బ్యాగ్‌లో మరో రూ.90 వేలు ఉన్నాయి. అయితే ఉన్న మొత్తం పెద్ద డినామినేషన్ నోట్లు కావటంతో చిల్లర నిమిత్తం కారు దిగి పక్కనే కొంత దూరంలో ఎవరితో మాట్లాడుతున్నారు. కారులో డబ్బు ఉన్న విషయాన్ని పసిగట్టిన దుండగులు ఆయన వచ్చేలోపే కారు అద్దాలు పగలగొట్టి రూ.1.80 లక్షల నగదును దోచుకెళ్లారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ద్వారా నిందితుని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.