- పేదల హక్కులను కాలరాసేందుకు బీజేపీ కుట్ర
- దేశవ్యాప్తంగా 6 గ్యారంటీలు
- ఆదిలాబాద్ అభివృద్ధి తెలంగాణ సర్కార్ బాధ్యత
- కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi: భారతదేశం ప్రమాదంలో పడబోతుంది.. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే యోచనలో ఉందని, తద్వారా పేదలు హక్కులను కోల్పోతారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అధ్యక్షతన జరిగిన జన జాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్లయితే హక్కులను హరించడమే కాకుండా రిజర్వేషన్లు రద్దవుతాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకే అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ పేదల హక్కులను కాలరాసి ధనికులకు అండగా ఉంటుందని విమర్శించారు.
దేశంలో 22 మంది ధనికులకు 16 లక్షల కోట్ల రూపాయలను బీజేపీ ధారాదత్తం చేసిందని, ఈ సొమ్ము దేశ ప్రజలందరి వద్ద ఉన్న సొమ్ముతో సమానమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశమంతా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఏడాదికి లక్ష 30 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు.
ఆదివాసీలే మొదటి వ్యక్తులు
ఆదివాసీలు అంటేనే ఈ దేశంలో మొదటి వ్యక్తులని, అటువంటి ఆదివాసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా ఉన్న ఆదివాసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి
అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఒక మహిళకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, స్వతంత్ర కాలం నుంచి నేటి వరకు ఏ పార్టీ మహిళకు ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి అవకాశం కల్పించలేదని అన్నారు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదివాసి ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను అధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు, పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ, నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాల చారి, నారాయణరావు పటేల్‌తోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.