Nirmal Collector
Nirmal Collector

Nirmal Collector: ఎంపీడీవోలదే బాధ్యత…. కలెక్టర్ అభిలాష

Nirmal Collector: వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ఆత్మ’ (ATMA) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మత్స్య సంపద అభివృద్ధిపై దృష్టి సారించాలని, చేపల పెంపకం, నిల్వ, హార్వెస్టింగ్ అనంతరం చేపట్టాల్సిన ఆధునిక సాంకేతిక విధానాలపై రైతు సమూహాలు, మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మత్స్య ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై రైతుల్లో అవగాహన పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రతి శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ రూపొందించిన వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రత్యక్ష నమూనాలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలల కాలం వ్యవసాయ పరంగా కీలకమని, వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు.

ప్రతి మండలంలో ఎంపీడీఓలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో త్వరలోనే ‘కిసాన్ మేళా’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేళాలో ప్రగతిశీల రైతులను ఆహ్వానించి వారి అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం, కిచెన్ గార్డెనింగ్, రూఫ్‌టాప్ గార్డెనింగ్ వంటి అంశాలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డీపీఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, మత్స్య శాఖ ఏడీ రాజ నర్సయ్య, వెటర్నరీ అధికారి బాలిగ్ అహ్మద్, జెడ్పీ సీఈవో శంకర్, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, ఆత్మ కమిటీ సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *