- ప్రసూతి దినం రోజు ఆసక్తికర ఘటన
- పరీక్ష కేంద్రం వద్దనే 108 వాహనం
Group-2 Exam: నేడే ప్రసూతి దినం.. అయినా తగ్గేది లేదు.. పరీక్ష రాయడమే లక్ష్యం.. ఉద్యోగమే నా ఊపిరి.. అంటూ నిండు చూలాలు సోమవారం గ్రూప్-2 పరీక్షలు రాసింది. అధికారులు ఆసుపత్రికి వెళ్లాలని సూచించినప్పటికీ తన లక్ష్యం పరీక్ష రాయడం, ఉద్యోగం సాధించడం అంటూ మొండికేసిన రేవతి చిట్టచివరికి పరీక్ష రాసి తన పంతం నెగ్గించుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేవతి అనే నిండు గర్భిణి. సోమవారం రెండో రోజు గ్రూప్-2 పరీక్షలు రాసింది. ఆస్పత్రిలో వైద్యులు సోమవారం ప్రసూతి తేదీని ఇచ్చినప్పటికీ పరీక్ష రాయాలని పట్టుదలతో అనుకున్నది సాధించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా పరీక్ష రాయాలని రేవతి మొండికేయడంతో పరీక్షా కేంద్రం వద్ద 108 వాహనాన్ని, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేవతి పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అధికారులు ఉత్కంఠతో ఉన్నారు. ప్రశాంతంగా రేవతి పరీక్ష పూర్తి కావడంతో ఊపిరిపించుకున్నారు.