Khanapoor CHC
Khanapoor CHC

Khanapoor CHC: కాలం చెల్లిన సెలైన్.. రోగుల ప్రాణాలతో చెలగాటం

  • కలెక్టర్ సీరియస్
  • ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
  • ఐదుగురికి మెమో జారీ

Khanapoor CHC: నిర్మల్ జిల్లా ఖానాపూర్ సామాజిక ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులను వినియోగించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురు ఉద్యోగులకు కలెక్టర్ అభిలాష అభినవ్ మెమోలు జారీ చేశారు. ఘటనకు సంబంధించి జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేశ్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులు సునీత (ఫార్మసిస్ట్), చంద్రకళ (స్టాఫ్ నర్స్)లను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ వంశీ, ఫార్మసిస్టులు శ్రీనివాస చారి, ఎం.విజయ్ కుమార్, వెంకటేశ్, కళ్యాణిలకు మెమోలు జారీ అయ్యాయి. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

అసలేం జరిగిందంటే
ఖానాపూర్‌ పట్టణంలోని సీహెచ్‌సీ సిబ్బంది ఓ రోగికి కాలంచెల్లిన సెలైన్‌ ఎక్కించారు. కడెం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎస్‌.కె.అజారుద్దీన్‌ జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని అడ్మిట్‌ చేసుకుని సెలైన్‌ ఎక్కించారు. అజారుద్దీన్‌ సోదరుడు సెలైన్‌ పరిశీలించగా ఎక్స్‌పైరీ అయినట్లు గుర్తించాడు. విషయం తెలుసుకున్న విలేకరులు దవాఖానకు వెళ్లి చూడగా మెడిసిన్ ట్రాలీలో మూడు వాయిల్స్ కాలం చెల్లినవి ఉన్నాయి. ఇంజెక్షన్ ఓపీకి వెళ్లగా ఓ వాయిల్ మూడు నెలలకు ముందే గడువు ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *