Modi Wayanad visit: ప్రకృతి విపత్తుకు గురైన కేరళ రాష్ర్టంలోని వయనాడ్‌లో శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఉదయం మోడీ కన్నూర్ చేరుకున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తులో ప్రాణాలతో బయటపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో సైన్యం నిర్మించిన బెయిలీ వంతెనను వీక్షించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌తో కలిసి మోడీ ఐఏఎఫ్‌కు చెందిన మిల్ మి -17 హెలికాప్టర్‌లో వయనాడ్ చేరుకున్నారు. వీరి వెంట కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలను మోడీకి వివరించారు. ప్రధాని సహాయ శిబిరం, దవాఖానను సందర్శించారు. కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలుసుకొని మాట్లాడారు.