- మహిళా సమ్మాన్ స్కీమ్ పూర్తి డిటెయిల్స్
Mahila Samman Savings Scheme: మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పేరున ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం పోస్టాఫీసుల్లో చిన్న పొదుపు పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించారు. ఈ పథకం ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. మహిళలు, బాలికల పేరిట గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే వీలుంది. 7.5 శాతం వడ్డీని వర్తింపజేయనున్నారు.
ఈ పథకంలో ఏమైనా రిస్క్ ఉందా?
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకం ఇది. దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. ఈ పథకం పూర్తిగా మహిళలు, బాలికలకు మాత్రమే వర్తిస్తుంది. మహిళలు, బాలికల సంరక్షకులు ఈ పథకాన్ని తెరవొచ్చు.
గరిష్ఠ డిపాజిట్ పరిమితి ఎంత?
ఈ పథకం కింద కనీస డిపాజిట్ రూ.వెయ్యి కాగా, గరిష్ఠ డిపాజిట్ రూ.2లక్షల వరకు ఉంది. ఖాతా తెరిచినప్పటి నుంచి మూడు నెలల విరామం తరువాత మహిళ లేదా బాలిక సంరక్షకుడు రెండో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాను తెరవొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ రెండేళ్లు ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తరువాత ఖాతాదారుకు మెచ్యూరిటీ చెల్లిస్తారు.
మధ్యలో ఉపసంహరణకు అవకాశం ఉందా?
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం కింద పాక్షిక ఉపసంహకరణకు అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తరువాత ఖాతా బ్యాలెన్సులో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
వడ్డీ రేటు ఎంత?
ఈ పథకం స్థిర వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ప్రముఖ బ్యాంకుల ఫిక్సుడ్ డిపాజిట్లు (FD), ఇతర చిన్న పొదుపు పథకాలకన్నా ఇది చాలా ఎక్కువ. వడ్డీ త్రైమాసికానికి జమ చేస్తారు. ఖాతా మూసి వేసిన సమయంలో పూర్తి చెల్లింపు చేస్తారు.
పథకం ప్రయోజనాలు ఏంటి?
- ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న పథకం. పూర్తి సురక్షితమైనది. పెట్టుబడిలో రిస్క్ జీరో పర్సెంట్ అని చెప్పొచ్చు.
- 7.5 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
- మహిళలు, బాలికలు ఈ పథకానికి అర్హులు
- పథకం కాలపరిమితి రెండేళ్లు
- ఈ పథకం నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రీ మెచ్యూర్ ఉపసంరహణకు అవకాశం ఉంది.
- మహిళా సాధికారతకు వారు స్వయం సమృద్ధి సాధించడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. ఆర్థికంగా స్వతంత్రంగా నిలదొక్కుకునేందుకు సహాయపడుతుంది.
పన్ను ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
పన్ను మినహాయింపు (TDS) ఈ పథకం కింద అందుకున్న వడ్డీ నుంచి మినహాయిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌కు (TDS) వర్తిస్తుందని CBDT తెలిపింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194A ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్ నుంచి పొందే వడ్డీ రూ.40 వేలు లేదా రూ.50 వేలు (సీనియర్ సిటిజన్స్) కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే (TDS) వర్తింపజేస్తారు. రెండు సంవత్సరాలపాటు గరిష్ఠంగా రూ.2 లక్షల పెట్టుబడి కోసం ఈ పథకం వడ్డీ మొత్తం రూ.40 వేలు మించదు. దీంతో ఈ పథకంలో వడ్డీ నుంచి (TDS) టీడీఎస్ తీసేస్తారు.
అర్ధంతరంగా ఖాతా మూసేయొచ్చా?
- మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖాతాను అనివార్య పరిస్థితుల్లో ముందుగానే మూసేసే వెసులుబాటు కల్పించారు.
- ఎలాంటి కారణం చెప్పకుండా ఖాతా తెరిచిన ఆరు నెలల తరువాత ఖాతాను మూసేస్తే 5.5 శాతం వడ్డీ వర్తిస్తుంది.
- ఖాతాదారు మరణిస్తే ఈ నిబంధన వర్తించదు.
- ఖాతాదారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సందర్భంలోనూ నిబంధన వర్తించదు. వీరికి అసలుతోపాటు వడ్డీ మొత్తం చెల్లిస్తారు.
పథకం వర్తించే బ్యాంకులేవి?
ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 జూన్ 27న మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌కు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేటు బ్యాంకులు అధికారం ఇచ్చారు.
- కెనరా బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టాఫీసులో ఖాతా ఎలా తెరువాలి?
- అధికారిక ఇండియన్ పోస్ట్ వెబ్‌సైట్ నుంచి సర్టిఫికెట్ కొనుగోలు కోసం దరఖాస్తుని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సమీపంలోని పోస్టాఫీసు శాఖను సందర్శించినా దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.
- పోస్టాఫీసు చిరునామాను ‘టు ది పోస్టు మాస్టర్’ గడిలో పూర్తిచేయాలి
- దరఖాస్తుదారు పేరు రాసి, ఖాతాను ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’గా పేర్కొనాలి.
- ఖాతా రకం, చెల్లింపు, వ్యక్తిగత వివరాలు రాయాల్సి ఉంటుంది.
- డిక్లరేషన్, నామినీ వివరాలు భర్తీ చేయాలి
- అవసరమైన పత్రాలతో ఫారమ్‌ను అందజేయాలి.
- నగదు లేదా చెక్కు ద్వారా పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలి.
- మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో పెట్టుబడి పెట్టిన తరువాత సంబంధిత సర్టిఫికెట్‌ను అందజేస్తారు.
అవసరమైన పత్రాలు ఏంటి?
- దరఖాస్తు ఫారమ్
- ఆధార్ కార్డు, ఓటరు ఐటీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి KYC పత్రాల జిరాక్సు కాపీలు జత చేయాలి.
- కొత్త ఖాతాదారులు కోసం KYC ఫారమ్ భర్తీ చేయాల్సి ఉంటుంది.
- డిపాజిట్ మొత్తాన్ని చెక్కు లేదా పే ఇన్ స్లిప్ ద్వారా చెల్లించవచ్చు.
వడ్డీ లెక్కింపు ఎలా ఉంటుంది?
ఈ పథకం కింద రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని పొందుతారు. మొదటి సంవత్సరంలో అసలుపై రూ.15 వేలు వడ్డీ లభిస్తుంది. రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీని పొందుతారు. రెండేళ్ల నాటికి రూ.2,31,125 (పెట్టుబడి రూ.2లక్షలు + రూ.31,125 వడ్డీ) లభిస్తుంది.
ఇతర చిన్న పొదుపు పథకాలతో పోల్చితే..
ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి ప్రజలకు పెట్టుబడి మార్గాలుగా ఉపయోగపడతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్స్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌తో ఇతర చిన్న పొదుపు పథకాలను తేడాను గమనిద్దాం.