Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రేండేళ్లకోసారి జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పూజారుల (వడ్డెలు) సంఘం జాతర మహోత్సవ తేదీలను వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 28వ నుంచి 31వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. జనవరి 1 బుధవారం సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి శ్రీ సారలమ్మ అమ్మవారితోపాటు గోవిందరాజు, పగిడిద్ద రాజులను గద్దెకు చేరుస్తారు. 29వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారిని గద్దె వద్దకుతీసుకొస్తారు. 30వ తేదీ శుక్రవారం మొక్కులు సమర్పిస్తారు. 31వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లతోపాటు గోవిందరాజు, పగిడిద్ద రాజులు వనప్రవేశం చేస్తారు. వన దేవతలను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. తమ ఇలవేల్పుగా భావించే అమ్మవార్లకు మొక్కలు సమర్పించి తరిస్తారు. కుంభమేళా తరువాత లక్షలాదిగా భక్తులు తరలివచ్చే జాతర ఇదే కావం విశేషం.