- చెరువులు చెర వీడేనా?
- హైడ్రా దూకుడుతో కబ్జాదారుల్లో దడ
- ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై నజర్
- త్వరలోనే జిల్లాలకు విస్తరణ?
Houses in ponds.. Complexes..: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా జిల్లాలకు విస్తరించే యోచనలో రాష్ర్ట ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో నిర్మల్ పట్టణంలో చెరువులు, కందకాలను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకున్న వారి గుండెల్లో దడ మొదలైంది. హైదరాబాద్ లాంటి నగరంలోనే అత్యంత విలువైన భవనాలను నేలమట్టం చేస్తుంటే ఇక జిల్లాల గురించి ఆలోచిస్తేనే ఆక్రమణ దారుల వెన్నులో జ్వరం పుట్టుకొస్తుంది. చెరువు శిఖం భూముల్లో అక్రమంగా ప్లాట్లను చేసి విక్రయించారు. చెరువుల హద్దులను సైతం చెరిపేసి భారీ భవనాలను నిర్మించుకున్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై నజర్
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కబ్జాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగానికి ఆక్రమణలపై వివరాలు సేకరించాలని అంతర్గతంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిర్మల్ పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై అధికార యంత్రాంగం వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులకు ఆక్రమణల వ్యవహారంపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాలని అంతర్గతంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
చెరువులు, కందకాల ఆక్రమణలపై ఫోకస్
నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా చెరువులు, కందకాల ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించారు. వందలాది ఎకరాల చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. నిర్మల్ పట్టణంలో నిజాం కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురై చిన్న కుంటలుగా మారిపోయాయి. నిర్మల్ పట్టణంలో చెరువులను ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్‌లు, నివాస గృహాలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించుకున్నారు. నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్, కురాన్నపేట్, ఇంద్రనగర్, నాయుడువాడ లతోపాటు జౌలినాల పరివాహక ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చెరువులు, కందకాల ఆక్రమణలపై అధికారులు వివరాలను సేకరించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చిన తర్వాతనే రంగంలోకి హైడ్రా దిగుతుందని విశ్వసనీయ సమాచారం.
ఆక్రమణలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు
భూ ఆక్రమణలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చెరువులు, కందకాల ఆక్రమణ స్థలంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తప్పవన్నట్లు తెలుస్తోంది. దీంతో భూములను ఆక్రమించిన వారితోపాటు ఆక్రమణలకు సహకరించిన వారిలోనూ హైడ్రా దడ మొదలైందని నిర్మల్ పట్టణంలో చర్చించుకుంటున్నారు.