SRSP WATER WAR
SRSP WATER WAR

SRSP Water War: వాటర్ వార్

  • నీటి విడుదలపై వివాదం
  • రైతు సమస్యపై రాజకీయం
  • ఎస్సారెస్పీ ద్వారా సరస్వతికి నీటి విడుదల
  • తామే విడుదల చేసామంటూ పరస్పర ప్రకటనలు
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం

SRSP Water War: నిర్మల్ రాజకీయం రంజు మీదుంది. ఎక్కడా లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అధికారం ఒకరిది, పవర్ మరొకరిది కావడంతో ఇక్కడ వింత పోకడలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY) అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే నిర్మల్‌లో అధికార పార్టీకి జిల్లా అధ్యక్షులు నిర్మల్ వారే కావడం, నిర్మల్ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేని సమస్య తలెత్తితే ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితిలో నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి లేకపోలేదు. అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏ పరిణామాలు ఏర్పడతాయో అనే సందిగ్ధంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు.

నీటి కోసం రైతుల ఆందోళన
తాజాగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కాలువకు నీటి విడుదలపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సరస్వతీ కాలువ ఆయకట్టు రైతాంగం తమ పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనకు దిగారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి కడెం వరకు సరస్వతీ కాలు కింద ఆయకట్టు రైతులు ఉన్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేశారు. పంట ఆఖరి దశలో ఒకటి రెండు తడులు అందితే తాము గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

హామీ నిలబెట్టుకున్నది ఎవరు?
గత వారం రోజుల క్రితం నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MAHESHWAR REDDY) ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ (VEDMA BOJJIU), డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు (SRIHARI RAO) సైతం ప్రభుత్వంతో మాట్లాడి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు హామీ ఇచ్చిన వెంటనే నీటిని విడుదల చేయిస్తే రైతులకు ఇంకొంత మేలు కలిగేది. వారం రోజుల అనంతరం గురువారం సరస్వతీ కాలువకు నీటిని విడుదల చేశారు.

మేమే.. కాదు మేమే
సరస్వతి కాలు ద్వారా నీటిని తామే విడుదల చేయించామని నిర్మల్ ఎమ్మెల్యే, నాయకులు పత్రికా ప్రకటనలు చేశారు… లేదు తామే నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి నీటిని విడుదల చేయించామని ఖానాపూర్ ఎమ్మెల్యే(KHANAPOOR MLA), డీసీసీ అధ్యక్షులు (DCC PRESIDENT) పత్రికా ప్రకటనలు చేశారు. దీంతో నిర్మల్ నియోజకవర్గంలో జల జగడం జెండాకెక్కింది. శ్రీరామ్ సాగర్ (SRIRAMSAGAR PROJECRT) నీటి విడుదల విషయమై ఇరు వర్గాలు ప్రకటనలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఒక పక్క వరుణుడు కరుణించడం, వారం రోజుల ఆలస్యంగా నైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. చివరి దశలో తమ పంటలకు నీరందుతోందని ఎవరు విడిపించారో తమకు తెలియకపోయినా తమ పంటలను కాపాడుకోగలుగుతున్నామని రైతులు(FARMERS) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *