Congress leader murder
Congress leader murder

Congress leader murder: జగిత్యాలలో కాంగ్రెస్ నాయకుడి హత్య

  • పక్కా ప్లానింగ్‌తో మర్డర్
  • మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు
  • నిందితులను శిక్షించాలని రోడ్డుపై బైఠాయించిన జీవన్ రెడ్డి

Congress leader murder: జగిత్యాల, అక్టోబర్ 22 (మన బలగం): జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య జిల్లాలో సంచలనం సృష్టించింది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58)ని అదే గ్రామానికి చెందిన బత్తిని సంపత్ గౌడ్, అతని అనుచరులు మంగళవారం ఉదయం అదే గ్రామంలో పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశారు. ఉదయం గ్రామ కూడలిలో ఉన్న హోటల్ నుంచి ఇంటికి గంగారెడ్డి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు కారుతో బైకును వెనక నుంచి ఢీకొట్టారు. అంతేకుండా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న గంగారెడ్డిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. 20కిపైగా కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న గంగారెడ్డిని కుటుంబీకులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన గంగారెడ్డి దారుణ హత్య జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం జగిత్యాల- ధర్మపురి రోడ్డుపై బైఠాయించిన జీవన్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన

తన అనుచరుడిపై జరిగిన దాడి తనపై జరిగినట్లేనని ఆందోళన సమయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కాంగ్రెస్ నాయకుడికి రక్షణ లేకుంటే ఎలా అంటూ నిలదీశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో మద్దతుగా వచ్చిన విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో నీకో దండం నీ పార్టీకో దండం అంటూ పార్టీ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్‌ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. హత్యకు పాల్పడ్డ నిందితుడిపై 20 కేసులున్నాయని, ఇటీవలే బతుకమ్మ సందర్భంగా కేసు నమోదు చేశారని, గంగారెడ్డిని చంపుతానని నిందితుడు బెదిరింపులకు దిగాడని, ఎందుకు అరెస్ట్ చేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

పీసీసీ అధ్యక్షుడి ఫోన్ కట్ చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాలలో జీవన్ రెడ్డి కుడిభుజం, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్య సమాచారం తెలుసుకున్న పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఫోన్‌లో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ అధ్యక్షులు ప్రయత్నించగా జీవన్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలలుగా అవమానాలను ఎదుర్కొంటున్నానని, పార్టీలో ఉండలేనని అంటూ పీసీసీ అధ్యక్షుడి ఫోన్ కట్ చేసినట్లు తెలిసింది.

హత్యా రాజకీయాలు నాకొద్దు: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని తాను కోరుకుంటున్నానని, హత్యా రాజకీయాలను నేను ప్రోత్సహించను, క్షమించనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో హత్యా రాజకీయాలకు తాను విరుద్దమని, కేవలం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఈ సంఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సంజయ్ ఇంటివద్ద పోలీస్ బందోబస్తు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి జీవన్ రెడ్డి.. సంజయ్ కుమార్ వర్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మారు గంగారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *