Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar: సమగ్ర కుటుంబ సర్వే సొమ్మును కేసీఆర్ నుంచి రికవరీ చేసే దమ్ముందా?

  • సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది?
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?
  • మళ్లీ కులగణన పేరుతో హడావుడి ఎందుకు?
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: దేశ విదేశాల్లో ఉన్న ప్రజలను ఉన్న ఫలంగా రప్పించి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం, ఆదాయం, ఆస్తిపాస్తుల వివరాలన్నీ నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఎన్నేళ్లు ఉన్నా కులమైతే మారదు కదా? మళ్లీ కులగణన పేరుతో ఈ హడావుడి ఎందుకు? అసలు సమగ్ర కుటుంబ సర్వే నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఒకవేళ కుటుంబ సర్వే నివేదిక పేరుతో వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే కేసీఆర్ కుటుంబం నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని సవాల్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి సోమవారం బోట్ సేవలను ప్రారంభించారు. కలెక్టర్ తోపాటు స్వయంగా బోట్‌లో వెళ్లి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోట్ సేవలు అందుబాటులోకి రావడంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. అందరూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడంతోపాటు ప్రతి ఒక్కరూ దత్తాత్రేయ స్వామి ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొనే అవకాశం లభించిందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణివల్ల రైతులు రోడ్లపై వడ్ల రాశులు పోసి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుల గణనపై మీడియా అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.

‘కేసీఆర్ హయాంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ చేయించారు. దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులందరినీ రాష్ట్రానికి రప్పించారు. సమగ్ర కుటుంబ సర్వేలో పేర్లు లేకపోతే తెలంగాణ వాళ్లే కాకుండా పోతున్నారని బెదరిస్తే. అమెరికా, లండన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులంతా ఉన్న ఫలంగా రాష్ట్రానికి వచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు అందించారు. అందులోనే కులం, మతం, ఆదాయం సహా ఆస్తిపాస్తుల వివరాలిచ్చారు. కులమైతే మారదు కదా, మరి ఆ నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? వందల కోట్ల ఖర్చు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి చేసిన ఆ సర్వే నివేదిక ఏమైంది? ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు? ఒకవేళ ఆ వివరాలు లేకపోతే, దానికోసం ఖర్చుపెట్టిన సొమ్మును కేసీఆర్ కుటుంబం నుండి రికవరీ చేయించాలి. ఆ దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? సమాధానం చెప్పాలి.’ అని సంజయ్ డిమాండ్ చేశారు.

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *