- ఫుడ్‌సేఫ్టీ ఎక్కడ?
- నామమాత్రంగా తనిఖీలు
- కల్తీపై చర్యలు శూన్యం
- నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు
- తాజాగా కలుషిత ఆహారం తిని మహిళ మృతి
- అధికారుల్లో స్పందన కరువు
adulterated food: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): నిర్మల్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. హోటళ్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తు్న్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు రసాయనాలు వాడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, పానీపూరీ బండ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నాసిరకం వస్తువులను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. అల్లం, కారంపొడి, మసాలాలు నాణ్యతలేనివి వినియోగిస్తున్నారు. వండిన ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేండుకు రసాయనాలు వాడుతున్నారు. తాజాగా కనిపించేందుకు కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారు. ఇదంతా బాహాటంగానే జరిగిపోతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు.
హడావుడి తప్ప చర్యలు శూన్యం
ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. హడావుడి చేయడం తప్ప చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దీపావళికి ముందు వరుసుగా రెండ్రోజులు హోటళ్లలో, మాల్స్‌లో తనిఖీలు నిర్వహించారు. స్టాల్స్‌లో విక్రయిస్తున్న పేనీల షాంపిల్స్ సేకరించారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఆర్భాటం తప్ప కల్తీని అరికట్టడం లేదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మాల్స్‌లో కాలం చెల్లించిన ఆహార పదార్థాలు లభించడంతో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అడపా దపా తప్ప ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నామమాత్రమే అని చెప్పాలి.
హోటళ్ల నిర్వాహకుల దురాశ
ఫుడ్‌స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు జిల్లా కేంద్రంలో ఉన్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే దురాశతో నాసిరకం పదార్థాలు, కల్తీ నూనెతో వంటలు చేస్తున్నారు. వండిన ఆహారపదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, రుచి, వాసన కోసం ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫార్మాల్డీహైడ్ వంటి కెమిల్స్ వినియోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బ్రాండెడ్ నూనెకు బదులుగా లూజ్ ఆయిల్ వాడుతున్నారు. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డలు, పిండి తదితర పదార్థాల్లో అసలు నాణ్యత అనేది వెతికినా కనిపించదు. ఎక్కువ లాభాల కోసం కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
కలుషిత ఆహారానికి ఒకరు బలి
తాజాగా నిర్మల్ పట్టణంలోని గ్రిల్9 రెస్టారెంట్‌లో బోథ్ పాఠశాలకు చెందిన సిబ్బంది భోజనం చేశారు. ఫలితంగా ఫుడ్ పాయిజన్‌కు గురై మధ్య ప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. పట్టణంలోని పలు హోటళ్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కుళ్లిన మాంసం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు రంగులు వేసి చేసి సర్వ్ చేయడం పరిపాటిగా మారింది. పట్టణంలోని పలు హోటళ్లను పరిశీలిస్తే అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కేవలం 80 రూపాయలకే బిర్యానీ అంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎగబడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రోగాల బారిన పడ్డ జంతువుల మాంసాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, రంగులు, రుచులు జోడించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని చూస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన గ్రిల్9 రెస్టారెంట్ ముందు ఎప్పుడూ రుచుల కోసం పాకులాడే భోజన ప్రియుల రద్దీ కనిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని హోటల్ యాజమాన్యం నాణ్యత లేని నూనెలు, కాలం చెల్లిన పదార్థాలు, రోగాల బారిన పడ్డ జీవుల మాంసంతో ఆహారపదార్థాలు తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫుడ్ పాయిజన్ ఘటన 2న చోటు చేసుకున్నా ఇప్పటి వరకు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తీసుకుంటారన్న నమ్మకం కూడా లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి హోటళ్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.