Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 1 (మన బలగం): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలూరు గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు తాగునీరు, టెంట్ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. నిర్ణీత తేమశాతం రాగానే ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలన్నారు.
ఆధార్, బ్యాంకు పాస్ బుక్, తదితర పత్రాల జిరాక్స్ కాపీలను తీసుకొని త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా చూడాలన్నారు. సన్నధాన్యం, దొడ్డుధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు సందర్భంగా జాగ్రత్తగా నమోదు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో సరిపడా టార్పాలిన్లు, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్యాడి క్లీనింగ్ యంత్రాల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలుపై ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్‌ను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణ్, డీఆర్డీవో విజయలక్ష్మి, సారంగాపూర్ ఎంపీవో అజీజ్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.