Purchases of cotton: నిర్మల్, నవంబర్ 11 (మన బలగం): పత్తి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్తో కలిసి ఆమె వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంటను అమ్మిన వెంటనే నిర్దేశించిన సమయంలోపు రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి తేమ శాతంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించి అధిక లాభాలు పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రోజువారీగా సేకరించిన పత్తికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పత్తి పంటను విక్రయించడానికి వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డులలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, మార్కెటింగ్ కార్యదర్శులు అజాం అలి, దుండా నాయక్, పుడ్యా నాయక్, గంగన్న, చంద్రశేఖర్ నాయక్, వెంకటేశ్వర్లు, వ్యవసాయ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.