Bandi Sanjay Kumar: సంపూర్ణతా అభియాన్‌లో మనమే ముందుండాలి

  • బాగా వెనుకబడ్డ ప్రాంతమిది.. ఆదుకోవడం మన కనీస బాధ్యత
  • మళ్లీ 3 నెలల్లో వస్తా.. ఈసారి మైక్రో లెవెల్‌లో రివ్యూ చేస్తా
  • ములుగు జిల్లా అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమీక్ష

Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సంపూర్ణతా అభియాన్’ కార్యక్రమాల అమలులో ములుగు, భూపాలపల్లి జిల్లాలు రాబోయే కాలంలో అగ్రభాగాన ఉంటూ నెంబర్ 1 ర్యాంకు సాధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆకాంక్షించారు. ‘అందుకోసం మీరేం చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ప్రజల నుంచి ఏ విధమైన సహకారం లభిస్తుంది? కేంద్రం నుంచి మీకు ఇంకే రకమైన సాయం అందించాలి?’ అని అధికారులను అడిగారు. ‘మూడు నెలల్లో మళ్లీ వస్తా.. సూక్ష్మస్థాయిలో సంపూర్ణతా అభియాన్‌పై రివ్యూ చేస్తా. ఏమైనా లోపాలుంటే అధిగమించేలా చూడండి. అంతిమంగా అత్యంత వెనుకబడ్డ ములుగు జిల్లాను అభివృద్ధిలో ఇతర జిల్లాలతో పోటీపడేలా చేద్దాం. ఆర్థిక ఫలాలు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడికి అందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశయాలను అమలయ్యేలా చూద్దాం’ అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నీతి అయోగ్ పర్యవేక్షిస్తున్న ‘సంపూర్ణతా అభియాన్’ కార్యక్రమాల అమలు తీరును సమీక్షంచేందుకు సోమవారం ములుగు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ములుగు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు జిల్లా ఉన్నతాధికారులంతా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. ‘సంపూర్ణతా అభియాన్’ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించారు. ఆస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన కన్నాయిగూడెంలో విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతికి సంబంధించి మూడు నెలల్లో అమలవుతున్న కార్యక్రమాలపై ఒక్కొక్కటిగా ఆరా తీశారు. ‘కన్నాయిగూడెం మండలంలో గత 3 నెలల్లో ఎంత మంది గర్భిణీలను గుర్తించారు? ఎంత మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు? నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా? గర్భిణుల గుర్తింపులో ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయి?’ 3 నెలల్లో యాంటినేటల్ కేర్ కోసం ఎంత మంది గర్భిణి(ప్రెగ్నెంట్స్) లను రిజిస్టర్ చేశారు? ఏయే గ్రామాలకు వెళ్లారు? ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత మంది పేర్లను రిజిస్టర్ చేశారు?’ అని ఆరా తీశారు.

జిల్లాలో అంగన్‌వాడీ హెల్పర్ల కొరత ఉందని, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి గర్భిణులను గుర్తించేందుకు తగిన సౌకర్యాలు లేవని, వాహన సౌకర్యం ఇబ్బందిగా ఉందని అధికారులు పేర్కొన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు ప్రతి నెలా లబ్ధిదారుల (గర్భిణుల) ఇంటికి పోతున్నట్లు, వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు, పోషకాహారం అందిస్తున్నట్లు, చిన్నారులకు టీకాలు క్రమం తప్పకుండా ఇస్తున్నట్లు చెబుతున్నరు కదా? మీ దగ్గరున్న డేటాకు ఆధారాలేమిటి? సిబ్బంది ఇచ్చే ఆ డేటాపై ఇప్పటి వరకు ఫీల్డ్ లెవల్‌లో ఎంక్వైరీ చేశారా? అంటూ కలెక్టర్‌ను ప్రశ్నించడంతో అందుకోసం ప్రత్యేకంగా స్టాఫ్‌ను నియమించినట్లు తెలిపారు. వైద్యాధికారులను ఉద్దేశించి ‘ఎంత మందికి బీపీ, షుగర్ టెస్టులు చేశారు? ఎన్ని గ్రామాలకు వెళ్లారు? టెస్ట్ చేసిన డేటాను ఎక్కడ అప్‌లోడ్ చేస్తున్నారు? దేనికైనా లింక్ చేశారా? టెస్టులు చేయించుకోవడానికి ఇష్టపడని వాళ్లున్నారా? ఉంటే వాళ్లకు అవగాహన కల్పించేందుకు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ వివరాలు సేకరించారు.

వ్యవసాయశాఖ అధికారులను ఉద్దేశించి ‘జిల్లాలో సాగు భూమి ఎంత ఉంది? ఎంత మంది రైతులు సాగు చేసుకుంటున్నరు? మూడు నెలల్లో ఎన్ని ఎకరాల్లో సాయిల్ టెస్ట్ (భూసార పరీక్షలు) నిర్వహించాలని మీకు టార్గెట్ విధించారు?అందులో ఎన్ని పూర్తి చేసుకున్నారు? గ్రామాలు, మండలాల వారీగా వివరాలు చెప్పండి. భూసార పరీక్షలు చేసుకునేందుకు రైతుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంది?’ అని అడిగారు. విద్యాశాఖకు సంబంధించి స్పందిస్తూ.. ‘జిల్లాలో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? సంపూర్ణతా అభియాన్ కింద బ్లాకులో ఎన్ని స్కూళ్లలో కరెంట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు? ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లకు కరెంట్ సౌకర్యం కల్పించారు? కరెంట్ సదుపాయం లేని స్కూళ్లకు ఎప్పటిలోగా కరెంట్ సౌకర్యం కల్పిస్తారు?’ అని ప్రశ్నించగా.. 100 శాతం స్కూళ్లకు కరెంట్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు బదులిచ్చారు. ‘జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? స్కూళ్లు స్టార్ట్ అయిన నెల రోజుల్లోనే ఎన్ని స్కూల్స్‌కు 100 శాతం టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. ఎన్ని స్కూళ్లకు 100 శాతం బుక్స్ నెలరోజుల్లోనే ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు? మిగిలిన స్కూళ్లలో పరిస్థితి ఏమిటి? వచ్చే ఏడాది నాటికి స్కూళ్లు స్టార్ట్ అయిన వెంటనే అందరికీ బుక్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి?’ అని ఆరా తీయగా… టార్గెట్ విధించిన స్కూళ్లన్నింటికీ నెలలోపే పుస్తకాలు అందించామని బదులిచ్చారు.

‘కన్నాయిగూడెం మండలంలో ఎన్ని కుటుంబాలున్నాయి? ఎన్ని పొదుపు సంఘాలున్నాయి? అందరూ సంఘాల్లో చేరారా? వారికి రివాల్వింగ్ ఫండ్ అందుతుందా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 90 శాతం మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేరారని, దాదాపు అందరికీ రివాల్వింగ్ ఫండ్ అందించినట్లు సంబంధిత అధికారి బదులిచ్చారు. ఆ వెంటనే తనవద్దనున్న రిపోర్ట్ ను చూపిస్తూ.. ‘రాష్ట్రం నుంచి తెప్పించిన నివేదికలో కన్నాయిగూడెంలోని పొదుపు సంఘాలకు నయాపైసా కూడా ఇవ్వలేదని ఉంది. మీరేమో అందరికీ ఇచ్చారని చెబుతున్నారు? ఇదేలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. కంప్యూటర్ మిస్టేక్ పడిందని, సరిచేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘సంపూర్ణతా అభియాన్’ కార్యక్రమాల ఉద్దేశం, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశ సారాంశాన్ని వివరించారు. ములుగు జిల్లా సంపూర్ణతా అభియాన్‌లో నెంబర్ 1గా ఉండేలా భవిష్యత్తులో కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు.

ఆ తరువాత కలెక్టర్, ఉన్నతాధికారులతో కలిసి కన్నాయిగూడెంలోని నందిపహాడ్ గ్రామంలో ‘ట్రైబల్ విలేజ్ అడాప్షన్ ప్రాజెక్టు’ కింద ఎంపికైన లింగాపూర్ కోయగూడానికి వెళ్లారు. గతంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఏయే సౌకర్యాలు కల్పించారని ఆరా తీశారు. గతంలో కరెంట్, వాటర్ సౌకర్యం కూడా లేదని, ఏ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ ద్వారా మంచి నీరు లభిస్తోందని, సోలారును ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్‌కు పిల్లలు వస్తున్నారా? పౌష్టికాహారం అందిస్తున్నారా? గర్భిణులు రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అక్కడే ఉన్న ఇద్దరు గర్భిణులకు నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. అక్కడి నుంచి జంగాలపల్లి చౌరస్తా వద్దనున్న ఓ ప్రైవేట్ పాఠశాల వద్దకు వెళ్లారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. స్థానికులతో కలిసి భోజనం చేశారు. అక్కడి నుంచి భూపాల జిల్లా రివ్యూ మీటింగ్‌కు బయలుదేరి వెళ్లారు.

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *