Group-3 Examinations
Group-3 Examinations

Group-3 Examinations: ప్రశాంత వాతావరణంలో గ్రూప్-3 పరీక్షలు జరగాలి.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి

Group-3 Examinations: జగిత్యాల, నవంబర్ 13 (మన బలగం): గ్రూప్ 3 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షా ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్లు, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు చైర్మన్ సూచించారు. గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో చేస్తున్న ఏర్పాట్ల వివరాలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన సామగ్రి స్ట్రాంగ్ రూమ్‌లో స్టోర్ చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్‌లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్‌లో 1.30 నుంచి అనుమతించాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని చైర్మన్ సూచించారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని చైర్మన్ సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, ఎక్కడ ఎటువంటి పొరపాటు రాకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి 3 నుంచి 4 పరీక్ష కేంద్రాలకు తహసిల్దార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని, పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలని చైర్మన్ సూచించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు వీలుగా జాయింట్ రూట్ అధికారులను నియమించాలని, ప్రతి 150 మంది అభ్యర్థులకు ఒక ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించాలని తెలిపారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *