- కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలి
- జోనల్ స్థాయి క్రీడాపోటీల ముగింపు ఉత్సవాల్లో కలెక్టర్
Zonal level sports meet: నిర్మల్, నవంబర్ 14 (మన బలగం): చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం ముధోల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2024-25, క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారుల గౌరవవందనం స్వీకరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. నవంబర్ 14, బాలల దినోత్సవం సందర్బంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ వంటి తనకు ఇష్టమైన ఆటలు ఆడాలని, క్రీడలు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో క్రీడలను ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, అవసరమైన అన్ని వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు, కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. అనంతరం జోనల్ స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను కలెక్టర్ బహుమతులను అందజేశారు. అనంతరం కలెక్టర్, అధికారులను కళాశాల ఉద్యోగులు, సిబ్బంది శాలువాలతో సత్కరించారు. అంతకుముందు దేశభక్తి గీతాలపై విద్యార్థులు చేరిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.