World Tallest Hanuman Statues: ప్రపంచంలోనే ఎత్తయిన హనుమాన్ విగ్రహాలు

ప్రపంచంలోనే ఎత్తయిన హనుమాన్ విగ్రహాలు
మన బలగం డెస్క్:

World Tallest Hanuman Statues:  కర్ణాటకలోని బిదనగరిలో 161 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహం ఉంది. మార్చి 30, 2023న దీన్ని ప్రతిష్టించారు. భారీ హనుమాన్ విగ్రహం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గంభీరమైన రూపంతో ఆకట్టుకుంటుంది. పంచముఖ హనుమాన్‌గా స్వామివారు దర్శనమిస్తారు. హయగ్రీవుడు, నారసింహుడు, గరుత్మంతుడు, వరాహుడుతో కూడిన ఆంజనేయుడు సాక్షాత్కరిస్తాడు. బెంగళూరు నుంచి 72 కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

135 అడుగుల అభయ ఆంజనేయుడు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో పరిటాల ఆంజనేయ ఆలయంలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వీర అభయ ఆంజనేయుడిగా పిలువబడే హనుమంతుడి విగ్రహం 135 అడుగుల ఎత్తులో ఉంది. 2003లో దీన్ని ప్రతిష్టించారు.

దేవదారు వృక్షాల మధ్య హనుమంతుడు
108 అడుగుల ఎత్తయిన ఆంజనేయుడి విగ్రహం సిమ్లాలోని జాకుహిల్‌లో ఉంది. రామ రావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం సంజీవని తేవడానికి హనుమంతుడు బయలుదేరుతాడు. అలా బయలుదేరిన హనుమంతుడు జాకు కొండపై విశ్రాంతి కోసం ఆగినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ విగ్రహం అందమైన దేవదారు వృక్షాల మధ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ కోతుల సంఖ్య అధికంగా ఉంటుంది.

దమంజోడిలో 108 అడుగుల హనుమంతుడు
ఒడిస్సాలోని దమంజోడి నాల్కోలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహం ఉంది. దమంజోడి పట్టణంలో ఎక్కడి నుంచైనా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని విక్షించవచ్చు. చేతిలో గధతో హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు.

ఢిల్లీలో 108 అడుగుల సంకటమోచనుడు
సంకటమోచన్ అంటే దు:ఖం, బాధలను నిర్మూలించేవాడు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో 108 అడుగుల ఎత్తయిన సంకటమోచన్ హనుమాన్ విగ్రహం ఉంది. దీన్ని 1724లో మహారాజా సింగ్ నిర్మించారు. దక్షిణాభిముఖంగా ఉండి, ఛాతిని చీల్చుతూ సీతాసహిత రామ లక్ష్మణులను చూపుతున్నట్లు ఉంటుంది. ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి

పాలరాతితో హనుమంతుడు
మహారాష్ర్టలోని నందూరాలో పాలరాతితో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 105 అడుగుల ఎత్తయిన విగ్రహం ఆకట్టుకుంటుంది. ఒక చేతిలో గధ, మరో చేతితో ఆశీర్వదిస్తున్నట్లు హనుమంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు.

హంపిలో ప్రపంచంలో అతిభారీ విగ్రహం
హనుమంతుని జన్మస్థలం హంపిలో 205 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తియితే ప్రపంచంలోనే అత్యంత భారీ విగ్రహం ఇదే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *