Beti Bachao Beti Padhao Decade Celebrations: నిర్మల్, మార్చి 5 (మన బలగం): మహిళల ఎదుగుదలకు చేయూతను అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ తెలిపారు. బేటి బచావో బేటి పడావో దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 22 నుంచి మార్చి 8 వరకు 45 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలలో విద్యార్థులకు మహిళా విద్య ఆవశ్యకత, మహిళా సాధికారిత, బాలికలు, మహిళల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, తదితర అంశాలపై అవగాహనను పెంపొందించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళ సంక్షేమ అధికారులంతా సమాజంలో బాలికలకు, మహిళలకు ఇబ్బందులు కలిగితే వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు కుటుంబానికి భారం కాదని, నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని తెలిపారు. 100, 1098, 181, 1930 హెల్ప్‌లైన్ నంబర్లపై బాలికలు, మహిళలు పరిజ్ఞానం కలిగి ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలంతా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా సీనియర్ సివిల్ జడ్జి (జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్) జి. రాధిక మాట్లాడుతూ, మహిళలకు సంబంధించిన హక్కులు, చట్టాలపై మరింత విస్తృత అవగాహన పెంపొందించాలన్నారు. మహిళలందరికీ న్యాయపరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. బాలికలు, మహిళల్లో బాల్య వివాహ నిర్మూలన చట్టం-2006 గురించి చైతన్యం కలిగించాలన్నారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, అధికారులతో కలిసి బేటి బచావో బేటి పడావో ప్రతిజ్ఞ చేసి, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎసిడిపిఓ నాగమణి, డీఎంహెచ్ రాజేందర్, ఏఎన్ఎం ఆశాలు, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
