- నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ జీవితానికి సెలవు
- భార్య భర్తలు ఉమ్మడి జిల్లా వాసులే
- నిర్మల్ జిల్లా సోన్ మండల వాసి మోహన్ రెడ్డి
- జిల్లాలో చర్చనీయశంగా మారిన లొంగుబాటు
Maoist Leader Mohan Reddy Surrenders: అల్లారుముద్దుగా పెంచిన అమ్మా నాన్నలు కాలం చేసినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం కన్నెత్తి చూడలేదు. విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టి వెనుదిరిగి చూడలేదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా వనం వీడలేదు. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ పోరాటానికి సెలవు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు వివిధ బాధ్యతలను నిర్వర్తించిన ఎర్రి మోహన్ రెడ్డి లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావుతో పాటు 60 మంది మావోలు లొంగిపోయారు. వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్ పెల్లి గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి అలియాస్ వివేక్, అతని భార్య బెల్లంపల్లిలోని కన్నాల బస్తీకి చెందిన సరోజా లొంగిపోయారు.
విద్యార్థి దశలోనే ఉద్యమ బాట
సోన్ మండలం కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన ఎర్రి మోహన్ రెడ్డి ఎలియాస్ వివేక్ విద్యార్థి దశలోనే మావోయిస్టు ఉద్యమ బాట పట్టాడు. సోన్ మండల కేంద్రంలో పదో తరగతి వరకు చదువుకున్న మోహన్ రెడ్డి మంచిర్యాలలో ఐటీఐ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులై 1978లో దళంలో చేరిపోయాడు. శివారెడ్డి, నరసవ్వ దంపతులకు నలుగురు కుమారులు కాగా మూడో వ్యక్తి మోహన్ రెడ్డి 1960లో జన్మించారు. బాల్యం నుంచే ముక్కుసూటి తత్వం కలిగిన మోహన్ రెడ్డి దళంలో చేరిన నాటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అమ్మానాన్నలు కాలం చేసిన సమయంలో మోహన్ రెడ్డి వస్తాడని ఆశించిన పోలీసులు రహస్యంగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన అమ్మానాన్నల కడసారి చూపు కోసం కన్న ఊరికి రాలేదు.
రెండేళ్ల జైలు జీవితం
నాలుగు దశాబ్దాల ఉద్యమ కాలంలో ఎన్నడూ బయటకురాని మోహన్ రెడ్డి అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు 2007లో జైలు శిక్ష విధించారు. సుమారు రెండు సంవత్సరాల పాటు వరంగల్లో జైలు జీవితాన్ని అనుభవించిన మోహన్ రెడ్డి కోర్టులో కేసు కొట్టుకోవడంతో విడుదలయ్యాడు. ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ కోర్టు వద్ద ఆయన కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తుండగానే వారి కళ్లు కప్పి తిరిగి వనం బాట పట్టాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది అనే విషయం కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు.
కీలక బాధ్యతలు నిర్వర్తించిన మోహన్ రెడ్డి
మావో ఉద్యమంలో 1978 నుంచి నేటి వరకు వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలను మోహన్ రెడ్డి నిర్వర్తించారు. తనకు అప్పగించిన పని పూర్తి చేసే వరకు అవిశ్రాంత కృషి చేసే వ్యక్తి మోహన్ రెడ్డి కావడంతో ఆయన పార్టీలో అంచలంచలుగా ఎదిగి కేంద్ర స్థాయికి చేరుకున్నారు. ఉద్యమంలో చేరిన నాటి నుంచి నేటి వరకు వెనుదిరిగి చూడని మోహన్ రెడ్డి లొంగుబాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి చెందిన సలాకల సరోజన అలియాస్ లతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు జిల్లాకు చెందిన మావో అగ్ర నేతలు మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీ అంశంగా మారింది.
లొంగుబాటును స్వాగతిస్తున్నాం
మావోయిస్టు అగ్రనేత ఎర్రి మోహన్ రెడ్డి లొంగుబాటును స్వాగతిస్తున్నామని వారి సోదరులు కిష్టారెడ్డి, నరేందర్ రెడ్డి తెలిపారు. ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి నేటి వరకు ఆయనను దగ్గర నుంచి చూసిందే లేదని వారు అన్నారు. వరంగల్ జైలు నుంచి విడుదలైన సమయంలో ఇంటికి వస్తాడని ఆశించామని, తమ కంటికి కనిపించకుండా వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మానాన్నలు చనిపోయిన సమయంలోనూ ఆయన కడసారి చూపు కోసం రాలేదని తెలిపారు.

