Nirmal District Collector: నిర్మల్, జనవరి 16 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ, వార్డు సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లతో కలిసి ఆమె వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల అందేలా సమగ్ర లబ్దిదారుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలకు సంబందించి అర్హులైన లబ్దిదారుల ఎంపికను ఈనెల 19వ తేదీలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అర్హులను గుర్తించాలని తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీకి కుటుంబ ఆదాయం, భూములు వంటి విషయాలను ప్రమాణికంగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబందించి అధికారులు గుర్తించిన లబ్దిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలనలో వివిధ పథకాలకై ధరఖాస్తు చేసుకున్న వారి వివరాలను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించి అర్హులను గుర్తించాలన్నారు. రైతు భరోసా పథకానికి సంబందించి పంటను సాగు చేస్తున్న భూములను పారదర్శకంగా గుర్తించాలని తెలిపారు. సాగుకు యోగ్యం కానీ భూములు, గుట్టలు, వెంచర్లు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వే లైన్, రహదారుల కోసం తీసుకున్న తదితర భూముల వివరాలు జాబితాలో ఉండరాదని, సాగుకు యోగ్యంగా ఉండే భూముల వివరాలతో జాబితా తయారు చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆయా సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా పూర్తి పారద్శకత, నిబద్ధతతో క్షేత్రస్ధాయి పరిశీలన ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు సర్వే పూర్తికాని అర్హులందరూ ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాల్లో తమ వివరాలు తెలియజేయాలని, ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ (6305646600)ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో నిర్మల్, భైంసా ఆర్డీఓలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డిలు, జెడ్పీ సిఈఓ గోవింద్, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీఓ విజయలక్ష్మి, వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డిఎస్ఓ కిరణ్ కుమార్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
